హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గతనెలలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినపుడు రెండు తెలుగు రాష్ట్రాలకూ ఒక అద్భుతమైన హితోపదేశం చేశారు. “పొరుగువారిని మనం ఎంపిక చేసుకోలేము. మనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా మన పొరుగువారు అదేచోట ఉంటారు. వారితో శాంతి, సామరస్యాలతో ఉండాలా, గొడవలతో గడపాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది మనమే” అన్నారు. జీసస్ టెన్ కమాండమెంట్స్‌లో ఒకటైన ‘పొరుగువారిని ప్రేమించు’ కమాండ్‌మెంట్‌నుకూడా ఆయన ఉటంకించారు. పరోక్షంగా ఇరురాష్ట్రాల పాలకులకూ చేసిన ఈ అద్భుతమైన హితోపదేశం వారి చెవికెక్కిందో లేదో తెలియదు.
విభజన జరిగి 14 నెలలు కావస్తోంది. విభజనపై నాడు ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ కలిగాయి. మంచికే జరిగిందో చెడుకే జరిగిందో కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి ఇక ఎవరిపని వారు చేసుకుంటే సరిపోతుందని అంతా అనుకున్నారు. విభజనపై నెలకొన్న సంక్షోభం వీగిపోయిందనిమాత్రం అందరూ సంతోషించారు. కానీ అలా జరగటంలేదు. ప్రతిదానికీ గొడవలే. ప్రతివిషయంలోనూ వివాదమే. ఇద్దరు అన్నదమ్ములమధ్య వ్యవహారమైతే పెద్దలెవరైనా కూర్చుని ఇద్దరికీ ఉభయతారకంగా పరిష్కారం చేయటం కద్దు. అయితే ఇక్కడ వివాదాలు నడుస్తోంది రెండు రాష్ట్రాలమధ్య. ఎవరికి వారు అవతలివారిదే తప్పని ఆరోపిస్తున్నారు. కావాలనే అడ్డుపడుతున్నారని వాదిస్తున్నారు. వివాదాలనుంచి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఇరు ప్రభుత్వాల అధినేతలూ ప్రయత్నిస్తున్నారు. నిర్విరామంగా సాగుతున్న ఈ గిల్లికజ్జాలకు అంతమెప్పుడో తెలియటంలేదు. కానీ అంతిమంగా వీటితో నష్టపోతున్నదిమాత్రం ఇరురాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులు.
విద్యుత్‌పై ఘర్షణలతో తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం అంటూ ఇవాళ ఒక తెలుగు పత్రికలో ఓ వార్త వచ్చింది. విభజనచట్టంప్రకారం విద్యుత్ పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాలమధ్య తలెత్తిన వివాదాల ఫలితంగా ఇరు రాష్ట్రాల ప్రజలూ నష్టపోతున్నారని, తమకు రావాల్సినవాటాను ఉపయోగించుకునే పరిస్థితి లేకపోవటంతో కోట్లు ఖర్చుపెట్టి ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యుత్ కొంటున్నాయని ఆ వార్త సారాంశం. ఇక ఇలాంటి అంశంపైనే ఇవాళ్టి ఒక ఆంగ్లపత్రికలో మరోవార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సవరించిందని, దీనిపై తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారని ఆ పత్రిక కథనం. ఇక విద్యుత్ బోర్డ్ ఉద్యోగుల వివాదమైతే ఇవాళ ఢిల్లీకి చేరింది. విద్యుత్ బోర్డుకు చెందిన 1,253మంది ఉద్యోగులు, తాము ఆంధ్రాలో పుట్టిన నేరానికి తెలంగాణ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రిలీవ్ చేసిందని, తమకు న్యాయంచేయాలని కోర్టులచుట్టూ, కేంద్రంచుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో తాము చేసేదేమీలేదంటూ కేంద్రం ఇవాళ చేతులెత్తేసింది. ఇరు రాష్ట్రాలమధ్య జరుగుతున్న వివాదాలలో ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే. ఎమ్‌సెట్, ఇంటర్మీడియట్ బోర్డ్, పదో షెడ్యూల్ ఉమ్మడిజాబితాలోని యూనివర్సిటీలు, సంస్థలువంటి ఎన్నో అంశాలపై ఇరు రాష్ట్రాలమధ్య వివాదాలు టీవీ సీరియల్‌లాగా సాగుతున్నాయి. నదీజలాల విషయమైతే చెప్పనవసరంలేదు. పాలమూరు ఎత్తిపోతలపథకం, పోతిరెడ్డిపాడువంటి ఎన్నో ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలమధ్య శత్రుదేశాలస్థాయిలో మాటలతూటాలు పేలుతున్నాయి. విభజనతర్వాత రాష్ట్రాలుగా విడిపోతామేతప్ప అన్నదమ్ముల్లా కలిసుంటామన్న తెలంగాణ ప్రాంత నేతలు ఇప్పుడు అంత విశాలదృక్పథంతో వ్యవహరించటంలేదని ఏపీవారు, ఆంధ్రావాళ్ళు ఇంకా తమను మోసగించాలని చూస్తున్నారని తెలంగాణ నేతలు పరస్పరం విమర్శించుకుంటూనేఉన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వంపై పంతానికి పోయి ఏపీ కార్యాలయాలన్నింటినీ తక్షణమే హైదరాబాద్‌నుంచి తరలించాలని తీసుకున్న నిర్ణయం పర్యవసానాలను ఏపీ ఉద్యోగులు అనుభవిస్తున్నారు. తమ సంఖ్య దాదాపు లక్షన్నరదాకా ఉంటుందని, తామంతా ఉన్నట్లుండి అక్కడకు వెళ్ళటం చాలా కష్టమని ఉద్యోగులు వాపోతున్నారు. వీరిలో చాలా మంది జీవితభాగస్వాములు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తుంటారు…పిల్లలు తెలంగాణలో పుట్టిఉంటారుకాబట్టి ఇక్కడ లోకల్ కిందకు వస్తారు. తాము ఉన్నట్లుండి అక్కడకు వెళ్ళాలంటే అనేక సమస్యలు వస్తాయని ఉద్యోగుల వాదన. ఒకవేళ కుటుంబసభ్యులను వదిలి తాము వెళ్ళటానికి సిద్ధపడినా అక్కడ వసతి సౌకర్యాలుకూడా లేవని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకోసం హడావుడిగా రాష్ట్రాన్ని విభజించటం ఈ వివాదాలకు మరో ప్రధానకారణం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి విభజన చేయాలనుకుంటే ఇలా హడావుడిగా కాకుండా నింపాదిగా, శాస్త్రీయంగా చేసి ఉండేదన్నది అందరికీ తెలిసిన విషయమే. విభజనచట్టాన్ని హడావుడిగా రూపొందించటంవల్ల ఇరురాష్ట్రాలూ(ఒకచోట వీరైతే ఒకచోట వారు) నష్టపోతున్నాయి…పరస్పరం గొడవలు పడుతున్నాయి. మరోవైపు, ఉన్న సమస్యలను పరిష్కారించాల్సిన నేతలు దానికి బదులుగా ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రజలకు మరింత తలనొప్పికలిగిస్తున్నారు.
ఈ వివాదాలకు తెరపడి అంతా సామరస్యంగా సాగిపోయే పరిస్థితులు ఎప్పుడొస్తాయా అని తెలుగు ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది జరగాలంటే మొదట కావలసింది ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతల సంకల్పం. వారి మనసులలో ఆ సంకల్పం ఏర్పడితే చాలు మిగిలినవన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. లేకపోతే కేంద్రప్రభుత్వమైనా ఒక పెద్దమనిషిలాగా చొరవ తీసుకుని వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఈ రెండూ ఇక్కడ జరగటంలేదు. తెలంగాణలో టీడీపీని అడ్రస్ లేకుండా చేయాలని కేసీఆర్, టీఆర్ఎస్‌ను దెబ్బగొట్టి 2019నాటికైనా తెలంగాణలో పాగా వేయాలని చంద్రబాబు వ్యూహాలుపన్నుతున్నారు తప్పితే వివాదాల పరిష్కారానికి పూనుకోవకపోవటమే అసలు సమస్య. సొంత ప్రయోజనాల తర్వాతే ప్రజలైనా, ఎవరైనా అన్నది రాజకీయనాయకులు అనుసరించే మౌలిక సూత్రమైనప్పటికీ, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలూ తమ పంతాలనూ, రాజకీయాలనూ పక్కనబెట్టి పెద్దమనసు చేసుకుని వివాదాలకు చరమగీతంపాడితే ఇరు రాష్ట్రాల ప్రజలకూ మేలుచేసినవారవుతారు.