ఊహించినట్లే కేంద్రప్రభుత్వం పంతానికి పోయి ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేసింది. కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ కొద్ది సేపటి క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసారు.
ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలనను రద్దు చేసి హరీష్ రావత్ కి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అనుమతించడంతో ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టి ఈరోజు మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 29న ఆయన రాష్ట్ర శాసనసభలో తన మెజార్టీ నిరూపించుకోవడానికి సిద్దం అవుతున్నారు.
కేంద్రప్రభుత్వం మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళడంపై ఆయన స్పందిస్తూ “రాష్ట్రపతి పాలన విధించి కేంద్రప్రభుత్వం తప్పు చేసిందని హైకోర్టు నిన్న స్పష్టంగా చెప్పినప్పటికీ, తన తప్పును సరిదిద్దుకోకుండా కేంద్రప్రభుత్వం మళ్ళీ సుప్రీం కోర్టు వెళితే అక్కడ కూడా దానికి ఎదురుదెబ్బ తినకతప్పదు. హైకోర్టు తీర్పుపై కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళితే మాకేమి అభ్యంతరం లేదు,” అని చెప్పారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందుకు సస్పెండ్ అయిన 9మంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ ఈరోజు పిటిషన్లు వేశారు. తమను కూడా ఏప్రిల్ 29న శాసనసభలో జరిగే బలపరీక్షలో పాల్గొనేందుకు స్పీకర్ కి ఆదేషాలు జారీ చేయాలని వారు సుప్రీం కోర్టుకి విజ్ఞప్తి చేసారు. కేంద్ర ప్రభుత్వం, ఆ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.