భద్రాచలం సరిహద్దుల్లోని ఐదు గ్రామాలను తమకు ఇవ్వడానికి నిజంగానే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేశారని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఒక సందర్భంలో చంద్రబాబును కెసిఆర్ కలుసుకున్నప్పుడు అక్కడే వున్న పార్లమెంటు సభ్యుడు ఈ సంగతి ధృవీకరిస్తున్నారు. విలీన గ్రామాలన్నీ కాకపోయినా ఒక ఐదు వూళ్లు రాకపోకలు చదువులు వంటి వాటికోసం చాలా దూరం వెళ్లవలసి వస్తున్నందున ఏదో ఒక పరిష్కారం చూడాలని కెసిఆర్ కోరారట. దానికి తప్పక సద్భావంతో పరిష్కారం చేసుకుందామని చంద్రబాబు అన్నారట.
ఈ బదలాయింపు అనేక విషయాలతో ముడిపడి వున్నందున ముఖ్యమంత్రులు అధికారికంగా అన్ని వివరాలు చెప్పలేరని ఆయన వివరణగా వుంది. అయతే సమస్య ఎక్కువగా తెలంగాణ వైపు వుంది గనక తమ నాయకుడు దాన్ని ప్రస్తావిస్తున్నారని దేవినేని ఉమ వంటి మంత్రులు ఖండించడం కూడా వ్యూహాత్మకం కావచ్చని ఆ ఎంపి అభిప్రాయపడ్డారు. శాసనసభ స్థానాల పెంపు విషయంలోనూ ఎలాటి సందేహాలు అవసరం లేదన్నారు.