నువ్వునేను సినిమాల కాలం గుర్తుందా? మనసంతా నువ్వే తర్వాత ఉదయ కిరణ్‌కు చాలా పేరు తెచ్చిన నువ్వునేను .. దర్శకుడుగా తేజకు మలి విజయం.. చలో అసెంబ్లీ కాన్సెప్ట్‌ను ప్రేమతో ముడిపెట్టిన ప్రయత్నం. అది అలా వుంచితే ఆ చిత్రంలో ప్రధానాంశం కుబేరుడైన హీరో తండ్రి మరో వివాహిత మహిళ మిసెస్ మెహతాతోతో గడుపుతూ ఆమె కూతురునే కొడుక్కు చేసుకోవాలనుకోవడం.. దీనిపై ఆ కుర్రాడు కాస్త అసహ్యం ప్రదర్శిస్తే గొప్ప వాళ్ల ఇళ్లలో ఇవి మామూలే అంటాడు.
గత ఏడాదిగా ఇంద్రాణి పీటర్ ముఖర్జీల నేర ప్రహసనం చూస్తుంటే ఆచిత్రంలో మాటలే గుర్తుకు వస్తాయి. విలాస జీవితం కోసం కన్న బిడ్డ షీనా బోరాను చెల్లెలిగా పరిచయం చేసిన ఇంద్రాణి ఆమె తన మలిభర్త కుమారుడు రాహుల్‌ను ప్రేమించడం ఇష్టం లేక మాజీ భర్తతో కలిపి చంపించింది. 2012లో జరిగిన ఈ ఘోరం నాలుగేళ్ల తర్వాత అనుకోకుండా బయిటకు వచ్చింది. మన సమాజం దిగజారిపోయిందని అర్థమైన వాళ్లకు కూడా మరీ ఇంత నీచంగా మారిందా అని గగుర్పాటు కలిగించింది.
వీరిద్ధరూ ఒక ప్రముఖ చానల్ బాసులు కావడం ఇక్కడ మరింత తీవ్రమైన విషయం.ఇంద్రాణి సరే ఇప్పటికే నిందితురాలిగా వుంది. ఆమెను చేసుకున్న పీటర్ ముఖర్జీ పాత్రపైనే రకరకాల సందేహాలు. ఆయనకు ఇదంతా తెలియదనీ తెలుసనీ ఏదో ఆర్థిక కారణం ఈ నేరం వెనక వుందని అనేక కథలు. తాజాగా ఆయన తరపు న్యాయవాది ఆజాద్ పొందార్ కోర్టులో మాట్లాడుతూ తన క్లయింట్‌కు ఆ ఇద్దరి ప్రేమపై అభ్యంతరం లేదనీ, ఇంద్రాణిని నమ్మడం వల్లనే ఇదంతా జరిగిందని వాదించారు. పైగా ఈ వ్యవహారంలో ఇంద్రాణి ముఖర్జీ దేవన్ భట్రి అని ఐపిఎస్ అధికారితోనూ ఒక సైకియాట్రిస్టుతోనూ కూడా మాట్లాడేదని వారినీ విచారించాలని కోరారు. మొత్తానికి ఈ కేసులన్నీ ఎటుపోతున్నట్టు? నాగరిక విలువలు ఎక్కడున్నట్టు?