తెలంగాణ ఏర్పాటుకోసం ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో చాలా ఎక్కువగానూ విమర్శనాత్మకంగానూ చర్చల్లో పాల్గొన్నవారిలో నేనొకణ్ణి. అప్పట్లో ఉద్రేకాల గురించి ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే తెలుగు ప్రజల మధ్య వైరుధ్యాలు ఎప్పటికీ వైషమ్యాలు కావని చాలా నమ్మకంగా చెబుతుండేవాణ్ణి. తాత్కాలికంగా ఆవేశాలు వ్యక్తమైనా కాలం సర్దుబాటు చేస్తుందని నమ్మేవాణ్ణి. నిజంగానే ఎంతమంది నాయకులు ఎలాటి ప్రసంగాలు ప్రహసనాలకు కారకులైనా సరే ప్రజలు ప్రశాంతత కోల్పోలేదు.
ఇటీవల జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలోనూ ఆ విధమైన వాదనలు తీసుకొచ్చిన వారినీ చాలా ఖచ్చితంగానే ఖండించాను.ఇది తెలుగు ప్రజల మీద, చరిత్ర మీద, చైతన్యం మీద వున్న నమ్మకం, అభిమానం తప్ప మరొకటి కాదు. మొన్న ఒక సభలో ఎన్టీఆర్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసలు 360 లో రాశాను. తాజాగా గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగు ప్రారంభంలో అభినందన ప్రసంగంలో కెసిఆర్ ఎన్టీఆర్‌ను ఏకోన్ముఖంగా ప్రశంసించడమే గాక తెలుగు జాతి తెలుగు ప్రజల చరిత్ర, మద్రాసీలనుంచి గుర్తింపు తేవడం వంటి పదాలతో సాగడం యాదృచ్చికమేమీ కాదు.
కేవలం రెండు పాలక పార్టీల కలయికగానో సర్దుబాటుగానో మాత్రమే దీన్ని చూడటం పాక్షికతే అవుతుంది. చరిత్ర అన్నది నిరంతర ప్రవాహం లాటిది తప్ప స్థిరబిందువు ఎన్నటికీ కాదు. ఆయా సందర్బాలను అవసరాలను బట్టి ఎవరు ఏమి మాట్లాడినా అంతిమంగా గత వారసత్వాలను, చారిత్రిక అనుబంధాలను ఎవరూ విస్మరించజాలరు.
నిజానికి కెసిఆర్ సినిమా రంగంలో కోస్తా జిల్లాలకు భౌగోళికంగా కలిగిన సదుపాయాన్ని సూటిగానే ప్రస్తావిస్తుంటారు. అలాగే మొన్న నీటి ప్రాజెక్టుల చర్చలో రాయలసీమకు నీళ్లు ఇవ్వడం గురించి కూడా మాట్లాడారు. వ్యూహ ప్రతివ్యూహాలు రాజకీయ సంవాదాలు సంఘర్షణలు సాగాల్సిందే గాని సానుకూల సంకేతాలను సంకుచితంగా చూడాల్సిన అవసరం లేదు. ఇతరత్రా కూడా తెలుగురాష్ట్రాల సుహృద్భాం పెరగడానికి, ప్రజలకు మేలు జరగడానికి ఇవి దోహదపడాలి.