ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. నిన్న ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనను రద్దు చేసి హరీష్ రావత్ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వీలు కల్పిస్తే, ఈరోజు సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విదించింది. ఈ కేసును ఏప్రిల్ 27కి వాయిదా వేస్తూ అంతవరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయబోమని కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ నుంచి వ్రాతపూర్వకంగా ఒక హామీని తీసుకొంది. అంతవరకు రాష్ట్రం గవర్నర్ పాలనా క్రింద నడుస్తుంది. కనుక హరీష్ రావత్ చేతికి ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లే వచ్చి కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ చేజారి పోయింది.
ఈ కేసులో ఇరు పక్షాలు తమ వాదన వినిపించేందుకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే హైకోర్టు తీర్పుపై స్టే మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ దీపక్ మిశ్రా మరియు జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై ఉత్తరాఖండ్ హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు కాపీలను ఏప్రిల్ 26లోగా ఇరు పక్షాలకు అందజేయాలని, ఆ మరునాడు అంటే ఏప్రిల్ 27న వాటి ఆధారంగా వాదనలు విన్న తరువాత దీనిపై తీర్పు వెలువరిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.
ఈ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, స్పీకర్ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, కపిల్ సిబాల్ వాదించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించడమంటే మళ్ళీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడమేనని వాదించడంతో, ఆవిధంగా జరగదని సుప్రీం ధర్మాసనం అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వద్ద లిఖిత పూర్వకంగా హామీ తీసుకొంది. ఈ కేసును అవసరమయితే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. కనుక ఏప్రిల్ 27 వరకు అందరూ వేచి చూడవలసిందే.