వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తాజాగా మరో వికెట్ పడిపోతున్నది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఎమ్మెల్యే చాంద్ బాషా, నియోజకవర్గంలోని తన అనుచరులతో కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎన్ని పాట్లు పడుతూ ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న సమయంలోనే ఇలా.. మరో జంపింగ్ చోటు చేసుకోవడం విశేషం.
అయితే చాంద్‌బాషా జంపింగ్ వెనుక ఆసక్తికరమైన కోణాలు కూడా ఉన్నాయి. శాసనసభ సమావేశాల సమయంలోనే చాంద్‌భాషా పార్టీ మారవచ్చుననే సంకేతాలు అందాయి. నిజానికి అది చాలా ఆసక్తికరమైన సంఘటన. చాంద్ బాషా ఏపీ అసెంబ్లీకి ఉన్న ప్యానెల్ స్పీకర్లలో ఒకరు. బడ్జెట్ సెషన్ సమయంలో ఒకరోజు ఆయన ఛెయిర్ చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ తనకిచ్చిన సమయం కంటె చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. స్పీకర్ హోదాలో ఉన్న చాంద్ బాషా, తమ సొంత పార్టీ అధినేత జగన్‌ను పలుమార్లు హెచ్చరించారు. జగన్ గారూ మీరు ఆపాలి.. అంటూ చెబుతూ వచ్చారు. అయినా సరే.. స్పీకరు కుర్చీలో ఉన్నది తమ పార్టీ వాడే కదా అనే ఉద్దేశంతో జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అంతలో స్పీకరుగా చాంద్‌బాషా కఠిన నిర్ణయం తీసుకుని, జగన్ మైకు కత్తిరించేశారు. అసలే స్వామిభక్తి, విధేయత విపరీతంగా ఉండే వైకాపా ఎమ్మెల్యే తమ పార్టీ అధినేత మైకు కత్తిరించేయడం అనేది ఆరోజు తీవ్రమైన చర్చ అయింది.
చాంద్‌బాషా కూడా జంపింగ్ బాటలో ఉన్నాడేమోనని, అందుకే జగన్‌ను ఖాతరు చేయలేదని ఆరోజున బాగా పుకార్లు వచ్చాయి. దానికి తగ్గట్లుగా ఆ వెంటనే ఆయన నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఆయన కారు మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. అది కూడా వైకాపా వారే, జగన్ అభిమానులే చేసినట్లుగా ప్రచారం జరిగింది. మొత్తానికి కొన్ని వారాల గ్యాప్ తర్వాత చాంద్‌బాషా ఓ నిర్ణయానికి వచ్చినట్లుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార తెలుగుదేశం పార్టీలో శుక్రవారం ఆయన చేరబోతున్నారు.