కాంగ్రెస్ పార్టీ తరఫున పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించడానికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సిద్ధం అవుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తన పోరాటాన్ని ప్రారంభించడానికి ఆయన ఉద్యుక్తులవుతున్నారు. అయితే తమ పార్టీలో ఏకాభిప్రాయం లేకుండా, ఒక అంశం మీద రెండు రాష్ట్రాల్లో నాయకులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, వారు సాగిస్తున్న పోరాటానికి ఏం విలువ ఉంటుంది. ఒకవైపు పాలమూరు ప్రాజెక్టులను ఏపీసీసీ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ నాయకులు దానికోసం పోరాడుతూనే ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో రఘువీరా సాగించే ఉద్యమానికి ఏం విలువ ఉంటుంది.
మరో సంగతి ఏంటంటే- రఘువీరా ఇప్పటికే తన మాటకు విలువలేకుండా తానే పలుచన చేసుకున్నారు. పాలమూరు ప్రాజెక్టుల వల్ల ఏపీలో 8 జిల్లాలు ఎడారిగా మారిపోతాయంటూ రఘువీరా కొన్నాళ్ల కిందట ఈ ఉద్యమాన్ని ప్రకటిస్తున్నప్పుడు జోస్యం చెప్పారు. దీనివలన నీటిఎద్దడితో ఎండిపోయే జిల్లాలను ఆయన ఏ రకంగా లెక్కవేశారో గానీ.. గుంటూరు కృష్ణా జిల్లాలను కూడా అందులో కలిపేశారు. ఇప్పుడు ఆ రెండింటిని మినహాయించి రాయలసీమతో పాటూ నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మాత్రమే నష్టం అని అంటున్నారు.
ఇంకో కీలక విషయాన్ని కూడా గమనించాలి. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులతో రాహుల్ గాంధీ ఒక భేటీ నిర్వహించి.. ఇరువురిని ఏకాభిప్రాయానికి తీసుకువస్తారని… ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రత్యేకించి రాయలసీమకు జరుగుతున్న నష్టాల మీదనే ప్రధానంగా పోరాటం సాగుతుందని, అదే కాంగ్రెస్ పార్టీ విధానంగా పోరాటం ఉంటుందని.. ఏపీసీసీ నాయకులు ప్రకటించారు. అయితే ఆ దిశగా నామమాత్రపు ప్రయత్నం కూడా ఇప్పటిదాకా జరిగిన సూచనలు లేవు. కనీసం తమ సొంత పార్టీలోనే ఒక నిర్దిష్టమైన ఏకాభిప్రాయానికి రాలేని కాంగ్రెస్ పార్టీ.. ఏదో జనాన్ని బురిడీ కొట్టించడానికా అన్నట్లుగా నాంకే వాస్తే ఉద్యమం నిర్వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.