సోమవారం నుంచి మళ్ళీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి కనుక లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని రాజకీయ పార్టీలను రేపు సమావేశం ఏర్పాటు చేసి సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించవలసిందిగా కోరబోతున్నారు. ఈ తంతు ప్రతీసారి జరిగేదే కానీ దేనిదారి దానిదేనన్నట్లు పార్లమెంటు సమావేశాలు మొదలవగానే ఏదో ఒక అంశం లేవనెత్తి సభా కార్యక్రమాలు జరుగకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతుంటాయి. ఆవిధంగా చేసి కేంద్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామని అవి చాలా సంతోషించవచ్చు కానీ ఆవిధంగా చేసి సభలో సమస్యలపై లోతుగా చర్చ జరగకుండా చేసి, వాటికి కేంద్రప్రభుత్వం సమాధానాలు చెప్పుకోకుండా తప్పించుకొనే అవకాశం కల్పిస్తున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేసినందుకు ఆ పార్టీ కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. కనుక సోమవారం నుంచి మొదలయ్యే సమావేశాలలో అదే అంశం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో పోరాడటం తధ్యం. దానిని ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం ఇష్రాత్ జహాన్ కేసును చేతిలో సిద్దంగా ఉంచుకొంది.ఆ కేసులో చిదంబరం వంటి మాజీ కేంద్ర మంత్రులపై కొన్ని ఆరోపణలున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీని ఎలాగయినా ఒప్పించి ఈ సమావేశాలలో జి.ఎస్.టి. బిల్లును ఆమోదింపజేసుకొంటామని వెంకయ్య నాయుడు తదితరులు చెపుతున్నారు. అవి కాక మరో 15-20 బిల్లులపై సభలో చర్చ జరిపి ఆమోదం తెలుపవలసి ఉంది. కానీ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు దానికి సహకరిస్తాయనే నమ్మకం లేదు. రాజ్యసభలో భాజపాకి తగినంత బలం లేకపోవడం వలననే అది బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తోంది. కానీ మున్ముందు భాజపా దాని మిత్రపక్షాలకి రాజ్యసభలో బలం పెరిగితే ఇంక కాంగ్రెస్ ని లెక్క చేయనవసరం కేంద్రప్రభుత్వానికి ఉండదు. కనుక ముఖ్యమయిన బిల్లులు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి సహకరిస్తే, అది తమ గొప్పతనంగా చాటింపువేసుకొనే అవకాశమయినా మిగులుతుంది కదా?