త్వరలో తెలంగాణా మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కె.టి.ఆర్. చూస్తున్న పంచాయితీ రాజ్ శాఖను జూపల్లి కృష్ణారావుకి అప్పజెప్పి, ఆయన చూస్తున్న పరిశ్రమల శాఖను కె.టి.ఆర్.కి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఐటి, పారిశ్రామికాభివృద్ధికి మంత్రి కె.టి.ఆర్.కృషి చేస్తున్నారు కనుక ఆ రెండు ఆయన అధీనంలో ఉన్నట్లయితే వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుపడుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఒకదానితో ఒకటి ముడిపడున్న గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖలు ఒకరి అధీనంలోనే ఉన్నట్లయితే వాటిని నిర్వహణ తేలికవుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బహుశః రెండు మూడు రోజులలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్, తెదేపాల నుంచి వచ్చి చేరినవారు, తెరాసలో చాలాకాలంగా పనిచేస్తున్న వారు మంత్రివర్గంలో చోటు దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్కో మంత్రికి రెండు మూడు శాఖలు అప్పగిస్తుండటంతో మంత్రి పదవులు ఆశిస్తున్నవారు చాలా నిరాశ చెందుతున్నారు.