హాలీవుడ్ సినిమాలకి బడ్జెట్, మార్కెట్ రెండూ కూడా ఎక్కువే కనుక హాలీవుడ్ హీరోలు ఈ ప్రపంచాన్ని ఇంకా అవసరమయితే ఈ విశాల విశ్వాన్ని కాపాడే బాధ్యత భుజాలకి ఎత్తుకొంటుంటారు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా మన భారతీయ సినిమాలకి బడ్జెట్, మార్కెట్ రెండూ పరిమితమే గాబట్టి మన హీరోలు తమ చుట్టూ ఉన్న సమాజాన్నో లేదా ఒక చిన్న గ్రామాన్నో, రాష్ట్రాన్నో, దేశాన్నో ఉద్దరించే బాధ్యత స్వీకరించేసి, అందుకోసం తరచూ అవినీతి పోలీస్ అధికారులతో, రాజకీయ నేతలతో (సినిమాలలో మాత్రమే) యుద్ధాలు చేసేస్తుంటారు. అల్పసంతోషులయిన ప్రేక్షకులు రాజకీయ నాయకులను ఉద్దేశ్యించి తమ అభిమాన హీరోలు పలికే ఆ పంచ్ డైలాగులకు పరవశించిపోయి చేతులు నొప్పెట్టేవరకు చప్పట్లు కొట్టి సంతృప్తి పడుతుంటారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రముఖ మలయాళీ సినీ నటుడు సురేష్ గోపీ ఎక్కువగా ఇటువంటి సినిమాలే చేసేవారు. ఆయన భాజపాకి మద్దతు పలకడంతో రాజ్యసభలో సీటు కన్ఫర్మ్ అయిపోయింది. సరిగ్గా ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఇదివరకు ఆయన చేసిన ఒక సినిమాలో పలికిన పంచ్ డైలాగులకు అప్పట్లో థియేటర్లో చాలా చప్పట్లు పడ్డాయి కానీ అవే ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి.
ఇంతకీ ఆయన పలికిన డైలాగుల సారాంశం ఏమిటంటే “ఎన్నికలలో పోటీ చేసి గెలవలేని రాజకీయ నాయకులే దొడ్డిదారిన పార్లమెంటులో ప్రవేశిస్తుంటారు. డబ్బుతో బలిసిపోయున్న ఎన్.ఆర్.ఐ.లు, మద్యం వ్యాపారులు, అవినీతిపరులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వెదజల్లి పదవులు,అధికారం కొనుకొంటూ ఉంటారు. అటువంటివారు సమాజానికి చీడ పురుగులు. వారిని నిర్ధాక్షిణ్యంగా నాశనం చేయవలసిందే లేకుంటే వారి వలన యావత్ సమాజం నష్టపోతుంది.”
సురేష్ గోపీని తిరువనంతపురం నుంచి శాసనసభకు పోటీ చేయమని భాజపా అభ్యర్ధించింది. కానీ ఆయన సున్నితంగా నిరాకరించారు. అందుకు ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు కనుక ఈవిషయంలో ఎవరూ ఆయనను తప్పు పట్టలేరు. కానీ ఆయన భాజపా తరపున ఎన్నికలలో ప్రచారం చేసేందుకు అంగీకరించారు. అందుకు ప్రతిఫలంగా కేంద్రప్రభుత్వం ఆయనని (కళారంగానికి చెందినవారి కోటాలో) రాజ్యసభ సభ్యుడుగా నామినేట్ చేసింది. అంతేకాదు మోడీ మంత్రివర్గంలో కేరళ రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా మంత్రిగా లేరు కనుక సురేష్ గోపికి ఏదో ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
కనుక ఇప్పుడు ఆయన కూడా ఎన్నికలలో పోటీ చేయకుండా దొడ్డిదారినే రాజ్యసభలోకి ప్రవేశించి, కేంద్ర మంత్రి అవబోతున్నారు కనుక ఆనాడు సినిమాలో పలికిన ఆ పంచ్ డైలాగులే ఇప్పుడు కేరళలో మారుమ్రోగిపోతున్నాయి. కేరళ యువత సోషల్ మీడియాలో ఆ డైలాగులను పెట్టి వాటిపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.