మీడియా నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు పోటీ పడుతున్నారంటూ ఒక పత్రిక వరుసగా మొదటి పేజీ కథనాలు ఇస్తున్నది. సోషల్ మీడియాలోనూ అలాటి మాటలే వినిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి ఆర్కె, టివి 5 నాయుడు, టివి 9 శ్రిని రాజు, సిఎల్ రాజం (పూర్వపు నమస్తే తెలంగాణ) అంటూ వినిపిస్తున్న పేర్లలో నిజముందా?
ఇందులో చాలా భాగం నిరాధారమైన వార్తలు, నేపథ్యం తెలియని వూహలే. ఒకప్పుడు నార్ల వెంకటేశ్వరరావు వంటివారిని పంపించిన మాట నిజమే గాని తర్వాత అనుకూల పాత్రికేయులను ప్రెస్ అకాడమీ చైర్మన్లకే పరిమితం చేస్తున్నారు. పరిస్థితుల మార్పును గమనించకుండా చెప్పే కథలు కొన్ని. ఆర్కే తనకు రాజకీయాలు సరిపడవనీ, సభలకు వెళ్లనని ఎప్పుడూ చెబుతుంటారు. తెలుగుదేశం ఇప్పుడున్న స్థితిలో పంపడం సులభం కూడా కాదు. ఇక టివి చానల్ యజమానులపై వార్తలను వారి సంస్థల్లోనే సీరియస్‌గా తీసుకోవడం లేదు. అలాటి అవకాశాలూ వుండవు. రాజంను కూడా ఇప్పుడు పంపే పరిస్థితి లేదనీ, దానికి బదులు వేరే రెండు మూడు పేర్లు కెసిఆర్ దగ్గర సిద్దంగా వున్నాయనీ టిఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. హౌం మంత్రి నాయని నరసింహారెడ్డిని పంపిస్తారనే కథ అసలే నిరాధారం. దాన్ని ఆయనే ఖండించారు.
ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేసులు సమన్ల తర్వాత ప్రధాని మోడీ ఆయనను తప్పించేబదులు మళ్లీ సభకు పంపకుండా వుంటే బావుంటుందని సూచించారని ఒక కథనం.అయితే రీ నామినేషన్‌పై చేస్తారనే ఆయన అనుయాయులు నమ్ముతున్నారు. మంత్రి పదవిలో వున్నవారిని తప్పించే పొరబాటు చంద్రబాబు చేయబోరనీ, కేసుల విషయం తేలినప్పుడు తేలుతుందని అంటున్నారు. ఇప్పటికీ ఢిల్లీలో పనులకు సంబంధించి సుజనా చౌదరికే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తుంటారని కూడా చెబుతున్నారు.
సీనియర్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా స్వరాష్ట్రం నుంచి కాకుండా మరోచోటి నుంచి వెళ్లడానికే మొగ్గు చూపుతారని ఎపి బిజెపి వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు నాయుడు అనూహ్యమైన పేర్లను సామాజిక కోణంలో ముందుకుతెస్తారని అంటున్నారు. విజయసాయి రెడ్డి పంపుతారనే గత కథనాలు వున్నా ఆ విషయంలో జగన్ కూడా అనూహ్యమైన నిర్ణయమే తీసుకున్నట్టు ఇప్పటికే ప్రచారంలో వుంది.