వర్తమాన రాజకీయాలలో కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు ఎందుకు ఆగిపోతాయో మళ్ళీ ఎప్పుడయినా మొదలవుతాయో లేదో ఎవరికీ తెలియదు. అవొక అంతుపట్టని బ్రహ్మ పదార్ధం వంటివి. అందుకు ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాంగ్రెస్ మాజీ ఎంపి రాజయ్య కేసులే మంచి ఉదాహరణలు. ఆ జాబితాలో వ్రాసుకోదగ్గదే తునిలో విద్వంసం కేసు.
ఆ సమయంలో కొందరు దుండగులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కి, పోలీసు, ప్రైవేట్ వాహనాలకి నిప్పు పెట్టడంతో వందల కోట్లు నష్టం వాటిల్లింది. ఈ సంఘటనలు జరిగి అప్పుడే నాలుగు నెలలు గడిచిపోయాయి కానీ ఇంతవరకు దోషులను పట్టుకోలేదు. పట్టుకొంటారో లేదో కూడా తెలియదు. కానీ అకస్మాత్తుగా ఆ కేసుల దర్యాప్తు కబుర్లు వినపడటం మొదలయ్యాయి. ఆ విద్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు చాలా పురోగతి సాధించినట్లు ఇవ్వాళ్ళ మీడియాలో వార్తలు వచ్చేయి. విద్వంసం జరిగిన జనవరి 30, 31 తేదీలలో తునిలోని సెల్ టవర్ల నుంచి వెళ్ళిన కాల్ డాటా వివరాలను, కొందరు స్థానికులు తమ మొబైల్ ఫోన్స్ లో చిత్రీకరించిన వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా కేసులో పురోగతి సాధించినట్లు, వాటి సహాయంతో ఆ విద్వంసానికి పాల్పడిన రౌడి షీటర్లను, వారి వెనుక ఉన్న పెద్ద మనుషులను గుర్తించే ప్రయత్నం జరుగుతోందిట!
అంటే ఇంతకాలం సిఐడి పోలీసులు ఈ విద్వంసంపై చురుకుగా దర్యాప్తు చేయలేదా? లేక ఇప్పుడే దర్యాప్తు మొదలుపెట్టారా? ఒకవేళ ఇప్పుడే దర్యాప్తు మొదలుపెడితే ఇంతకాలం ఎందుకు ఊరుకొన్నారు? ఇప్పుడే ఎందుకు మొదలుపెట్టారు? వంటి అనేక సందేహాలు కలుగుతాయి. వీటన్నిటికీ తెర వెనుక రాజకీయాలు.. పార్టీల రాజకీయ ప్రయోజనాలే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.