“ఓ డజను మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టి పోయినంత మాత్రాన్న వైకాపాకేమి నష్టం లేదు. మరో నలుగురైదుగురు వెళ్లిపోయినా నష్టం లేదు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20-30 కోట్లు చెల్లించి తెదేపా సంతలో గొర్రెలా కొనుగోలు చేస్తోంది.” ఈరోజు గవర్నర్ ని కలిసి పిర్యాదు చేసివచ్చిన తరువాత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో చెప్పిన మాటలవి. ఆయన తెదేపా నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి ఈ సందర్భంగా ఇంకా చాలా విమర్శలు చేసారు. అవి నిత్యం చేసే విమర్శలే కనుక మళ్ళీ వాటి గురించి వల్లించుకోనవసరం లేదు.
ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం గురించి జగన్ మాట్లాడిన మాటలను పరిశీలించినట్లయితే, ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తన పార్టీ నేతలకి, కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికేనని అర్ధం అవుతోంది. కానీ మరో నలుగురైదుగురు వెళ్లిపోయినా నష్టం లేదని చెప్పడం తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లుంది. అంటే మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీలో నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నారని తాను కూడా గ్రహించానని చెపుతునట్లుంది. ఎంత మంది వెళ్లిపోయినా పార్టీకి నష్టం లేదు అని బిగ్గరగా చెపుతూనే మళ్ళీ దాని గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ గంట సేపు విమర్శలు చేయడం విచిత్రం. ఆయన అక్కడ విమర్శలు గుప్పిస్తుండగానే మరోపక్క వైకాపా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. కర్నూలు, ప్రకాశం, కృష్ణ జిల్లాలకు చెందిన మరి కొందరు వైకాపా ఎమ్మెల్యేలు కూడా వచ్చే నెల మొదటి వారంలో పార్టీ వీడబోతున్నట్లు తాజా సమాచారం. ఈ నేపధ్యంలో జగన్ ఏదయినా బలమైన రాజకీయ వ్యూహంతో తెదేపాను ఎదుర్కోవాలి తప్ప ఈవిధంగా విమర్శలు చేయడం వలన ప్రయోజనం ఏమీ ఉండబోదు.