తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, వరుపుల సుబ్బారావు, సునీల్ కుమార్ ముగ్గురిపై అనర్హత వేటు వేయవలసిందిగా కోరుతూ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి ఒక వినతి పత్రం అందించారు. వారు ముగ్గురూ పార్టీని వీడి తెదేపాలో చేరినప్పటికీ ఇంకా వైకాపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నందున వారి ముగ్గురిని అనర్హులుగా ప్రకటించాలని చెవిరెడ్డి పార్టీ తరపున స్పీకర్ ని కోరారు.
ఇంతవరకు తెదేపాలో చేరిన వారి సంఖ్య 12 అయితే చెవిరెడ్డి ఇచ్చిన లేఖలో కేవలం ముగ్గురి పేర్లే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే మిగిలినవారు మళ్ళీ పార్టీలోకి తిరిగి వచ్చేస్తారని వైకాపా భావిస్తోందా లేక ఇంకా తెదేపాలో చేరేవారు ఎవరయినా ఉంటే అందరికి కలిపి ఒకేసారి మరో లేఖ ఇస్తుందో తెలియదు.
వైకాపా పద్ధతి ప్రకారం స్పీకర్ కి విజ్ఞప్తి పత్రం ఇచ్చింది. దానిపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకొంటారో ఆయన ఇష్టం. ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నవారయినా అయన వారిపై చర్యలు తీసుకోరని చెప్పగలరు. తీసుకోకపోయినా ఎవరూ ఏమీ చేయలేరని తెలంగాణాలో ఇప్పటికే రుజువయింది. అయినా దీనిపై వైకాపా న్యాయపోరాటం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ్ళే ప్రకటించారు. కనుక ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి వచ్చిన తరువాత ఆ కార్యక్రమం పెట్టుకోవచ్చు.