“భాజపాని ఓడించాలంటే అందరూ త్యాగాలకు సిద్దపడాలి. నేను, లాలూ ప్రసాద్ యాదవ్ త్యాగాలు చేయకపోయుంటే బిహార్ లో మహాకూటమి ఏర్పడేదే కాదు. మేమిద్దరం త్యాగాలు చేయబట్టే బిహార్ లో మతతత్వ భాజపాని ఓడించగలిగాము. కనుక ఇప్పుడు ఇదే ఫార్ములాని దేశవ్యాప్తంగా అమలు చేసి భాజపాని వ్యతిరేకించే సెక్యులర్ పార్టీలన్నీ కూడగట్టేందుకు ప్రయత్నిస్తాను. అదేమీ నేరం కాదు కనుక వాటినన్నిటినీ దగ్గర చేసేందుకు వాటి మధ్య నేను జిగురు పదార్ధంలాగ పనిచేస్తాను. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను ఆశించి నేను ఈ పని చేయడం లేదు. దేశ ప్రధాని ఎవరు కావాలని ప్రజలు నిర్ణయిస్తే వారే అవుతారు,” అని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఆయనను జెడియు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత డిల్లీలో పార్టీ కార్యాలయంలో తన నేతలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ఈ మాటలు అన్నారు.
నితీష్ కుమార్ కి ఎప్పటికయినా ప్రధాన మంత్రి అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉంది. అందుకే మోడీని ప్రధాన మంత్రి అభ్యర్ధిగా భాజపా ప్రకటించేందుకు సిద్దం కాగానే ఆయన ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు తన లక్ష్యం నెరవేర్చుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. అందుకోసం అందరూ త్యాగాలు చేయాలని కోరుతున్నారు. ఆ త్యాగాలు తన కోసం కాదు భాజపాని ఓడించడానికేనని నమ్మమని కోరుతున్నారు. బిహార్ లో కూడా భాజపాని ఓడించడానికి తాము త్యాగాలు చేసామని చెపుకొన్నారు. ఆ త్యాగాలు ఏమిటో వారికే తెలియాలి ఎందుకంటే బిహార్ లో తన అధికారం నిలబెట్టుకోవడానికే మహాకూటమి ఏర్పాటు చేసారు. నితీష్ కుమార్ పట్టుబట్టి, బెదిరించి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటింపజేసుకొన్నారు. ఆ తరువాత, మహాకూటమి అధ్యక్షుడిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ కి కూడా తెలియకుండా లాలూ, నితీష్, కాంగ్రెస్ పార్టీలు మొత్తం సీట్లన్నీ పంచేసుకొన్నారు. దానితో ఆయన అలిగి కూటమి నుంచి బయటకు వెళ్లిపోయి ఒంటరిగా పోటీ చేసారు.
ఇప్పుడు అదే మహాకూటమి ఫార్ములాతో దేశంలో అన్ని పార్టీలను కలుపుతానని నితీష్ కుమార్ చెపుతున్నారు! అంటే ఇంతకు ముందు బిహార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు స్థానిక పార్టీలను వాడుకొన్నట్లుగానే, ఇప్పుడు ప్రధాని కావాలనే తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి దేశంలో అన్ని పార్టీలని కూడా నితీష్ కుమార్ వాడుకోవాలనుకొంటున్నారన్న మాట! తన కోసం అందరూ త్యాగాలు చేయాలని కూడా చెపుతున్నారు. కాకపోతే దానికి మతతత్వ భాజపాకి వ్యతిరేకంగా పోరాటం అనే కలరింగ్ ఇస్తున్నారు అంతే! ప్రధాని కావాలని కోరుకొనేవారు ఉత్తరాది రాష్ట్రాలలో కనీసం ఓ డజను మంది, దక్షిణాదిన కనీసం ఓ అరడజను మంది ఉన్నప్పుడు నితీష్ కుమార్ కోసం వారందరూ ఎందుకు త్యాగాలు చేయాలి? ఆయనే జవాబు చెప్పాలి.