పూర్వపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ రాజకీయ జాతకం ఒకటి రెండు రోజుల్లో ఎన్ని రకాల మలుపులు తిరిగిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కాకుంటే అది ఆయనకు ఇష్టమైన సినిమా స్క్రీన్‌ప్లేలా వుండటం మరింత ఆశ్చర్యం. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక దీనిపై ప్రత్యేక కథనమే ఇచ్చింది. ఇటీవలే 360లో ఇంద్రాణి ముఖర్జీ కథకూ నువ్వునేను సినిమాకు పోలిక చెప్పుకుంటే, ఇప్పుడు రావత్ వ్యవహారం అర్జున్ నాయకుడుగా నటించిన ఒకే ఒక్కడు( హిందీలో నాయక్, అనిల్ కపూర్) కథను తలపించడం నిజంగా తమాషాగా వుంది. తమాషా ఎందుకంటే హరీష్ రావత్ మొదటినుంచి ఈ సినిమా తనకు చాలా ఇష్టమంటూ ఆ హీరో పాత్రను ప్రస్తావించేవారు. ఒక్కరోజులో ఆ సినిమాలోలాగే చాలా పనులు చేస్తాననే వారు. హైకోర్టు రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ మొన్న తీర్పు ఇవ్వగానే ఆయన ఒకరోజు సిఎంలాగే విజృంభించారు. క్యాబినెట్ సమావేశం జరిపి 130 కోట్ల విలువైన పథకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. టీచర్ల ధర్నాకు హాజరై ప్రసంగించారు. ఇంకా కొన్ని ఉత్తర్వులు వెలువరించారు. ఇంతలోనే సుప్రీం కోర్టు స్టే వార్త వచ్చేసింది. బెలూన్‌లో గాలిపోయింది! మామూలుగా కోరిన పాత్ర దొరికితే సంతోషిస్తారు గాని ఇక్కడ హరీష్ రావత్‌ను పాపం అనడానికి అదే కారణం!
మరోవైపున భారతీయ జనతాపార్టీ కూడా తనదైన హడావుడిలో మునిగిపోయింది. హైకోర్టు తీర్పు చెంపపెట్టు అనే విమర్శతో ఆత్మరక్షణలో పడినా గంభీరంగా వ్యవహరించిన ఆ పార్టీకి ఈ స్టే వూరట నిచ్చింది. అయితే అది సాంకేతికమే. హైకోర్టు తీర్పు లిఖితప్రతి లేదు గనక చూసేవరకు తను ఏ తీర్పు ఇవ్వలేనన్న కారణంతోనే సుప్రీం స్టే ఇచ్చింది. అది కూడా 27 వరకే. అంటే 29న బలపరీక్ష యథావిధిగానే వుండొచ్చని బిజెపికి తెలుసు. కనుకనే హడావుడిగా ఎంఎల్ఎలను కూడగట్టే పనిలో నిమగమైంది. 71 మంది సభ్యులున్న శాసనసభలో 9 మంది ఫిరాయింపు అనర్హత ఎంఎల్ఎల భవిష్యత్తు ఇంకా అస్పష్టమే. మిగిలిన 62లో 29 కాంగ్రెస్, 27 బిజెపి. ముగ్గురు ఇండిపెండెట్ల పిడిఎప్ గతంలో కాంగ్రెస్‌తో వుండగా తనవైపు తిప్పుకోవడానికి బిజెపి తంటాలు పడుతున్నది. బిఎస్పికిచెందిన ఇద్దరు క్రాంతిదళ్‌కు చెందిన ఒక్కరిని తిప్పుకోవడానికి అన్ని పాచికలు వేస్తున్నది. సుప్రీం కోర్టు ఈ సమయాన్ని రాజకీయ బేరసారాలకు వాడుకోరాదని హెచ్చరించినా ఎవరు ఖాతరు చేస్తారు