తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ లో లూప్ లైన్ లో ఉన్నవారు, విసిగిఅధికార గులాబీ పార్టీ లోకి స్వప్రయోజనాల కోసం జంప్ చేస్తే దానిని అర్ధం చేసుకోవచ్చు. చివరికి పార్టీ నెత్తిన పెట్టుకుంటున్న నాయకులూ కూడా.. నెమ్మదిగా తమ దారి తాము చూసుకుంటూ, పార్టీ ఎలా పోతే తమకు ఏంటి లెమ్మన్నట్లుగా గులాబీ బాట పడుతూ ఉండడం మాత్రం కచ్చితంగా షాకింగే. చిట్టెం రామ్మోహన రెడ్డి జంప్ చేస్తేనే సహించలేకుండా… రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం అని, పార్లమెంటును కదిలిస్తాం అని ప్రగల్బాలు పలికిన టీ కాంగ్రెస్ వారికి అంతకంటే పెద్ద షాక్ పువ్వాడ అజయ్ కుమార్ రూపంలో తగులుతోంది. ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్యే పదవులు మాత్రమే కాకుండా అయన తండ్రిని ఎమ్మెల్సీ చేయడానికి కూడా తమ సర్వ శక్తులు ఒద్దిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అయన ఫిరాయింపు అనేది పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
పువ్వాడ అజయకుమార్ ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే ల్లో ఒకరు. నిశితమయిన విమర్శలతో అధికార తెరాస ను శాసనసభలో ఇరుకున పెట్టగల కొద్ది మంది తెలివైన ఎమ్మెల్యేల్లో ఒకరు. వామ పక్ష కుటుంబం నుంచి వచ్చిన నేపధ్యం ఆయనది. కమ్యూనిస్టు కురువృద్ధుడు పువ్వాడ నాగేశ్వరరావు కు స్వయానా కుమారుడు. తండ్రి మాత్రం కమ్యూనిస్టు పార్టీ లొనే ఉండగా కొడుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు.
తెరాస మీద తనకున్న పోరాట అనుభవాన్ని అయన తండ్రికి పదవి దక్కేలా చేయడానికి కూడా ఖర్చు పెట్టారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగినప్పుడు తండ్రిని కమ్యూనిస్టు పార్టీ తరఫునే బరిలోకి దించి తను ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి, వారితో మద్దతు ఇప్పించి, చాలా కసరత్తు చేసారు. ఆ ప్రయత్నాలు అన్నీ బెడిసికొట్టాయి. తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కు పరాజయం తప్పలేదు. పువ్వాడ అజయ్ కోసం, కాంగ్రెస్ అంతగా గతంలో త్యాగాలు చేసిందన్న మాట. ఆయనను అంతగా నెత్తిన పెట్టుకున్నదన్న మాట.
ఇన్ని చేసినా ఇప్పుడు పువ్వాడ అజయ్ గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి నిర్ణయించుకోవడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్న నాయకులూ మరింతగా ఆగ్రహోదగ్రులు అవుతున్నారు. తెరాస ప్రేరేపిస్తున్న ఫిరాయింపులను ఊరకే వదలరాదని దీన్ని జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకు వెళ్లాలని వారు అనుకుంటున్నారు.