‘క్విట్ వైకాపా’ ఉద్యమం చాలా ఉధృతస్థాయిలో జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. పైగా తన పార్టీనుంచి తెలుగుదేశంలోకి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో ఏదో తన కోపాన్ని అసంతృప్తిని ప్రకటించడం మినహా.. వారిని బుజ్జగించడానికి గానీ, తన పార్టీలోనే కట్టుగా ఉంచుకోవడానికి గానీ.. వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి స్వయంగా ప్రయత్నాలు చేయడమూ లేదు, అంతో ఇంతో ఒకరిద్దరితో చేస్తున్నా, ఏమీ పెద్దగా ఫలితం ఇస్తున్నట్లుగానూ లేదు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశంలో చేరిపోవడానికి ముహూర్తం 27గా నిర్ణయించుకోవడం, అదే రోజున కర్నూలు జిల్లా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా చేరుతారనే ప్రచారం చర్చనీయాంశంగా ఉన్నాయి.
గొట్టిపాటి రవికుమార్ విషయంలో ఆయన పార్టీ ఫిరాయించే పరిస్థితి రావడానికి జగన్మోహనరెడ్డి ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయంటూ వైకాపాలోని కొందరు నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కొద్దిగా ప్రయత్నించి ఉంటే.. ఆ ఫిరాయింపును ఆపి ఉండవచ్చుననేది వారి వాదన. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా భూమా నాగిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే.. ఆ పదవి తనకు కావాలంటూ గొట్టిపాటి రవికుమార్ జగన్‌ను కోరారు. ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉండే పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వకపోతే తెదేపాలోకి వెళ్తా అనే.. సంకేతాలు కూడా ఆయన పంపారు.
కానీ జగన్ పట్టించుకోలేదు. పీఏసీ పదవిని మరొకరి చేతుల్లో పెట్టారు. పీఏసీ పదవి అసంతృప్తితోనే జ్యోతుల వంటి వారు కూడా వెళ్లిపోయిన సంగతి అందరికీ గుర్తుంటుంది. అదే అసంతృప్తి గొట్టిపాటిలో కూడా ఉంది. ఆ తర్వాత కూడా గొట్టిపాటి జగన్‌తో ఓసారి సమావేశం అయ్యారు. బహుశా అది జగన్ తరఫు నుంచి బుజ్జగింపు సమావేశం అయి ఉంటుందని అంతా భావించారు. అయితే తాజా పరిణామాల దృష్ట్యా చూస్తే.. జగన్ బుజ్జగింపులు ఏమీ ఫలించినట్లు లేదు. జగన్ ఫెయిల్యూర్ దెబ్బకు గొట్టిపాటి రవికుమార్ తెదేపాలోకి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. ఆయన వెళ్లేరోజునే బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా చేరుతారని అంటున్నారు. విశాఖకు చెందిన ఎమ్మెల్యే, మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా క్యూలైన్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అవన్నీ ఎప్పటికి తేలుతాయో వేచిచూడాలి.