మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద అధికారిక పెత్తనానికి వీలుగా రాహుల్ గాంధీకి త్వరలోనే పట్టాభిషేకం జరగబోతున్నట్లుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి ఆంతరంగిక సలహాదారుల్లో ఒకరుగా పార్టీ లో చక్రం తిప్పుతున్న కొప్పుల రాజు ప్రకటించారు. ప్రస్తుతం కిరీటం ఒక్కటి లేదు గానీ.. కాంగ్రెసు పార్టీ చక్రవర్తి లాగానే.. రాహుల్ గాంధీ అధికారాలు చెలాయిస్తూ వస్తున్నారు. ఇప్పటికి ఉన్నది కకేవలం ఉపాధ్యక్ష పదవి మాత్రమే అయినప్పటికీ, పార్టీ రాజకీయాలు మొత్తం ఆయన చుట్టూతానే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అధ్యక్ష హోదా పట్టాభిషేకం కూడా త్వరలో జరగబోతున్నట్లు తెలుస్తున్నది.
కొప్పుల రాజు… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర సర్వీసులో కీలకపదవుల్లో ఉంటూ నెమ్మదిగా ఆయన రాహుల్ గాంధీకి దగ్గరయ్యారు. రాహుల్‌కు అత్యంత ఆంతరంగికులైన, నమ్మకస్తులైన, వ్యూహకర్తల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీకి ఎస్సీసెల్ నాయకులూ అయ్యారు. ఆయన తాజాగా రాహుల్‌కు సంబంధించిన సీక్రెట్‌ను బయటపెట్టారు.
త్వరలోనే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించబోతున్నారని కొప్పుల రాజు వెల్లడించారు. రాహుల్ ఆ పదవిలోకి రాగానే.. పార్టీ నిర్వహణ, పరిపాలన పరంగా.. అనేక మార్పులు రాబోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహణలోని అనేక లోపాలను రాహుల్ గాంధీ గుర్తించడంకూడా పూర్తయిందన్నమాట. పైగా అంతర్గత ప్రజాస్వామ్యం గురించికూడా అక్కడ చర్చ జరుగుతున్నట్లుంది. కాంగ్రెస్‌లో ఎప్పుడూ అభ్యర్థుల ఎంపిక అనేది అధిష్ఠానం ఇష్టానుసారం మాత్రమే ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఆ నిర్ణయాధికారం డీసీసీల చేతికి వస్తుందని, డీసీసీలు ఎంపిక చేసిన పేర్లనే అధిష్ఠానం పరిశీలిస్తుందని కొప్పుల రాజు లీక్‌లు అందిస్తున్నారు. కానీ.. ఏదో డీసీసీల ముఖప్రీతికి ఆయన అంటున్నారు గానీ.. డీసీసీల పాత్ర ఇకపై కూడా.. ఏదో నామమాత్రంగానే ఉంటుందని ఊహించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొప్పుల రాజు మాటల్లో రాహుల్ పట్టాభిషేకం త్వరలోనే ఉంటుందనే సంగతి మాత్రం వెల్లడవుతోంది.