కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపులు, నిధులు విషయంలో విపరీతమైన అన్యాయం జరుగుతున్నదనే విషయంలో పార్టీ రహితంగా భాజపా యేతర పార్టీలు అందరికీ ఒకే అభిప్రాయం ఉంది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం తొలినుంచి ఎంత వివక్ష చూపినప్పటికీ కేంద్రంతో సానుకూలంగా వ్యవహరిస్తే తప్ప ఏ కొంచెమూ లాభపడే అవకాశం లేదనే దృక్పథంతోనే ఉన్నది. మరోకోణంలోంచి చూసినప్పుడు తెలుగుదేశం నాయకులకు అంతకుమించి వేరే గత్యంతరం కూడా లేదు. అయితే ఇతరపార్టీలన్నీ మరో రకంగా ఈ వ్యవహారాన్ని చూస్తున్నాయి. తమాషా ఏంటంటే.. అందరి టార్గెట్ ఒకటేగా కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా వైకాపా అదినేత జగన్మోహన్రెడ్డి ప్రవచిస్తున్న సిద్ధాంతాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతుండడం విశేషం.
తెదేపా- భాజపాల మధ్య బంధం ఎప్పుడు విచ్చిన్నం అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లుగానే.. జగన్ తొలినుంచి ప్రతిసారీ మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన ప్రతి సందర్భంలోనూ ఆ రెండు పార్టీల మైత్రికి గండికొట్టడమే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం నుంచి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు జిందాతిలిస్మాత్ వంటి ఏకైక పరిష్కారం అన్నట్లుగా.. ఒకటే సూచిస్తూ ఉంటారు. కేంద్రంలోని ఎన్డీయే నుంచి తెదేపా బయటకు రావడం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అని జగన్ పదేపదే చెబుతూ ఉంటారు. కేంద్రంలోని తెదేపా మంత్రులు తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తుంటారు. ఎటొచ్చీ.. వారిద్దరి మైత్రికి గండి కొట్టాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు జగన్ పాటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా ఆలపిస్తున్నారు. కేంద్రంనుంచి నిధులు వచ్చేలా వారి మీద ఒత్తిడి పెంచాలంటే.. ఎన్డీయే నుంచి తెదేపా మంత్రులు రాజీనామా చేయాలని అంటున్నారు. కేంద్రం ఒకసారి ఏపీకి ద్రోహం చేయడం ప్రారంభించిన తర్వాత.. ఎటూ వారు ద్రోహమే చేస్తారు. తెదేపా వారి మంత్రివర్గంలో ఉండగానే ద్రోహం చేస్తున్న వారు, సాయం విషయంలో మాట తప్పుతున్న వారు.. తెదేపా ఎన్డీయే నుంచి బయటకు వస్తే భయపడడం ఎందుకు జరుగుతుంది? అనే లాజిక్‌ను వారు ఆలోచించడం లేదు. తెదేపా రాజీనామాలు చేస్తే.. కేంద్రం నిధుల వరద పారించడానికి ఎలాంటి అవకాశం ఉన్నదో వారు తర్కబద్ధంగా చెబితే బాగుంటుంది.