కేసీఆర్ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించడానికి కసరత్తు ప్రారంభించారు. కొత్త వారికి కూడా చోటు కల్పించడం అవశ్యంగా మారిన నేపథ్యంలో.. ఎవరి మీద వేటు పడబోతున్నదనే సంగతి ఇంకా క్లారిటీ రాలేదు గానీ.. ప్రస్తుతానికి శాఖల్లో మార్పు చేర్పులు చేశారు. ఈ మార్పు చేర్పులే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ప్రాథమిక కసరత్తు గా విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ చేసిన మార్పు చేర్పుల్లో జూపల్లి కృష్ణారావునుంచి పరిశ్రమల శాఖను తప్పించడం అనేది చాలా కీలకంగా అందరూ భావిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడానికి సంబంధించి ప్రపంచమంతా పర్యటిస్తూ.. తనదైన ముద్ర చూపిస్తున్న కొడుకు కేటీఆర్ చేతికి పరిశ్రమల శాఖను కేసీఆర్ అప్పగించారు. ప్రస్తుతం కేటీఆర్ వద్ద ఉన్న పంచాయతీ రాజ్ శాఖను జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. అలాగే జోగు రామన్న పదవి కొనసాగింపు గురించి చాలా పుకార్లు నడుస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి బీసీ సంక్షేమ శాఖను తప్పించారు. ఆయనకు కేవలం అటవీశాఖ మాత్రమే మిగిలింది. బీసీ సంక్షేమ శాఖను తలసాని శ్రీనివాస యాదవ్ చేతికి అప్పగించారు. ఆయన వద్ద నుంచి వాణిజ్య పన్నుల శాఖను తప్పించారు. అది కాస్తా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది. మిషన్ భగీరథ శాఖ కూడా సీఎం వద్దనే ఉంది. ఈ మార్పు చేర్పులతో ఇవాళ నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి నిజానికి మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణనే చేపట్టాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి ఇది ప్రాథమిక కసరత్తు అనే అందరూ భావిస్తున్నారు. కొత్తగా ఎందరికి చోటు కల్పిస్తారో.. అదే జరిగితే ఎవరెవరికి ఉద్వాసన తప్పదో మాత్రం.. ఇంకా క్లారిటీ రావడం లేదు.