పవన్ కళ్యాణ్ సినీ ప్రస్తానం మరీ అంత గొప్పగా లేకపోయినప్పటికీ, ప్రేక్షకాదరణ మాత్రం స్థిరంగా ఉండటం విశేషమనే చెప్పవచ్చు. కానీ అయన రాజకీయాలకు దూరంగా ఉంటునప్పటికీ అందులో కూడా వేలు పెట్టడం వలన తరచూ ఏదో ఒక కారణం చేత ఎవరో ఒకరు ఆయనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన వాటిని పట్టించుకోకపోవడం వేరే సంగతి కానీ విమర్శలను మాత్రం ఆగడం లేదు. ఆయన జనసేన పార్టీని అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే పెడుతున్నట్లు ప్రకటించి, ఇంతవరకు ఏనాడూ ప్రభుత్వాలను గట్టిగా నిలదీసి ప్రశ్నించకపోవడమే అందుకు కారణమని అందరికీ తెలుసు.
ఏపి బిసి సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ ఆయనపై విమర్శలు గుప్పించారు. “ఆయన మద్దతు ఇస్తున్న తెదేపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలను ఫిరాయింపులకి ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఆయన నోరు విప్పి మాట్లాడరు. తన అభిమానుల అభిమానాన్ని చక్కడా ఉపయోగించుకొంటున్నారే తప్ప వారికిచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. తెదేపా ప్రజలను మోసం చేస్తే, పవన్ కళ్యాణ్ తన అభిమానులను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సినిమా షూటింగులు చేసుకొంటున్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి సినిమా డైలాగులు చెప్పడమే తప్ప అయన ప్రజల కోసం చేసిందేమీ లేదు. మళ్ళీ ఈసారి ప్రజల ముందుకు వస్తే ఆయనకి అభిమానులే బుద్ధి చెప్తారు,” అని ఉదయ కిరణ్ విమర్శించారు.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయిన తరువాత కూడా పవన్ కళ్యాణ్ తను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి, 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనుకొంటునప్పుడు, ఏదో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినట్లుగా ఆ విషయం ప్రకటించి అప్పుడు వచ్చేక రాజకీయాల గురించి మాట్లాడుతాను అంటే, ఈలోగా ఇటువంటి విమర్శల వలన జరగకూడని నష్టం జరిగిపోవచ్చు. కనుక ఆయన రాజకీయాలలోకి రాదలిస్తే, ఇప్పటి నుంచే అందుకు తగిన విధంగా వ్యవహరించడం చాలా అవసరం. ఒకవేళ ఆయనకి సినిమాలతో తీరిక లేదనుకొంటే, తన శ్రేయోభిలాషులు లేదా అభిమాన సంఘాలతో కూర్చొని చర్చించుకొని, పార్టీ ప్రతినిధులను నియమించుకొని వారి ద్వారా తన లేదా జనసేన అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ఇటువంటి విమర్శలకు ధీటుగా జవాబు చెప్పడం మంచిది. లేకుంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేసరికి జనసేనకి రాష్ట్రంలో వ్యతిరేక వాతావరణం ఏర్పడిపోయి ఉంటుంది. అప్పుడు ఎన్నికలనే కాదు దానిని కూడా అధిగమించడానికి చెమటోడ్చవలసి వస్తుంది. కనుక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎవరినీ ప్రశ్నించకపోయినా, తనను మరొకరు ప్రశ్నించే పరిస్థితి కల్పించుకోకుండా ఉంటె మంచిది కదా!