ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పుత్ర రత్నం రావెల సుశీల్ కొన్ని రోజుల క్రితం పట్టపగలు మద్యంమత్తులో బంజారా హిల్స్ రోడ్డులో ఒక వివాహిత ముస్లిం యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు సుశీల్, అతని డ్రైవర్ రమేష్ పై కేసులు నమోదు చేయడం, వారికి కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం, ఆనక వారు బెయిల్ పై విడుదలయ్యి బయటకు రావడం గురించి తెలిసిందే. ఆ తరువాత రావెల సుశీల్, రమేష్ హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేశారు. పోలీసులు తమపై అన్యాయంగా కేసు నమోదు చేసారని, తాము ఏ పాపం ఎరుగమని కనుక తమపై పెట్టిన కేసుని కొట్టివేయాలని వారు హైకోర్టుని అభ్యర్ధించారు.
ఆ పిటిషన్ని హైకోర్టు ఇవ్వాళ్ళ విచారణకు చేపట్టినప్పుడు, వారిపై పిర్యాదు చేసిన ముస్లిం యువతి వారిని తాను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని, కానీ వారిద్దరూ తన వెంటబడి వేధించినట్లుగా పోలీసులే తన చేత బలవంతంగా స్టేట్మెంట్ తీసుకొన్నారని ఆమె ఆరోపించారు. కనుక తన పిర్యాదును ఉపసంహరించుకొంటున్నట్లు ఆమె న్యాయస్థానానికి తెలపడంతో, సుశీల్, రమేష్ అభ్యర్ధనను మన్నిస్తూ వారిపై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కేసు ఏదోవిధంగా ఇలాగే సుఖాంతం అవుతుందని ఇదివరకే చెప్పుకొన్నాము, అలాగే ముగిసింది. జరిగిన సంఘటనలన్నిటినీ అందరూ ప్రత్యక్షంగా చూసారు కనుక వాటి గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఇది మంత్రిగారి పదవి, పరువు ప్రతిష్టలతో ముడిపడున్న అంశం కనుక, ఈ కేసులో భాదితురాలితో వారిరువురూ కోర్టు బయట రాజీ కుదుర్చుకొని ఉండవచ్చు. అందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ వారిపై పిర్యాదు చేసిన మహిళ ఇచ్చిన వాంగ్మూలమే ప్రశ్నార్ధకంగా ఉంది. పోలీసులు ఆమెచేత బలవంతంగా స్టేట్మెంట్ తీసుకోవలసిన అవసరం ఏమిటి? తీసుకొంటే ఎందుకు తీసుకొన్నారు? వారిని ఎవరు ఒత్తిడి చేసారు? అనే సందేహాలు కలుగుతాయి కానీ ఎటువంటి సందేహాలు లేకుండానే కేసు కొట్టివేయబడింది. ఎంతయినా మంత్రిగారి కొడుకు కదా?