తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒకరిని అనుసరించి ఒకరు వెళుతూ ఉండడం మనం చాల సందర్భాల్లో గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ విషయంలో కూడా అలాగే జరిగేలా ఉంది. రెండు పాలక పార్టీలు , తమ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. కొత్తగా పార్టీ లోకి వచ్చిన సీనియర్ లకు కాబినెట్ లో చోటు ఇవ్వడం గురించి ఇద్దరు సీఎం లు సరైన సమయం కోసం చూస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో కెసిఆర్ తనవంతు ప్రాధమిక కసరత్తు పూర్తి చేసారు. ఇక అయన బాటలో చంద్రబాబు నాయుడు కూడా నేడో రేపో కాబినెట్ కూర్పునకు సంబంధించి కసరత్తు చేయవచ్చునని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి.
నిజానికి కెసిఆర్ కంటే, చంద్రబాబు మీదనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ బాధ్యత ఎక్కువగా ఉంది. ఎందుకంటే అయన కేబినెట్లో ఇప్పటికే ఆరు ఖాళీలు ఉన్నాయి. చాలా మంది మంత్రులు రెండేసి శాఖలు చూస్తున్నారు. నిర్ణయాలు, పనులు మందగమనంతో సాగుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ప్రముఖులంతా ఆ పదవులను దక్కించుకున్న నాటినుంచి కాబినెట్ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ లు అయిన సీనియర్లు ఆశగా ఎదురుచూస్తూ బతుకుతున్నారు. ఈలోగా వైసీపీ నుంచి వలసల పర్వం మొదలైంది. వలసలకు ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత చూసుకోవచ్చులే అన్నట్లుగా చంద్రబాబు కాబినెట్ సంగతి పక్కనపెట్టారు. తీరా ఇప్పుడు కెసిఆర్ ఆ సంగతి తెరపైకి తెచ్చారు గనుక బాబు కూడా కసరత్తు మొదలుపెడతారని అంతా నిరీక్షిస్తున్నారు.