బాహుబలి సినిమా అనగానే దాని దర్శకుడు రాజమౌళి పేరు మొదట చెప్పుకొన్న తరువాతనే మిగిలిన ఎవరి పేరయినా చెప్పుకొనే పరిస్థితి. యావత్ భారత సినీ పరిశ్రమ గర్వపడే విధంగా, హాలీవుడ్ స్థాయిలో గొప్ప చిత్రాన్ని తీశారని అందరూ ఆయనని వేనోళ్ళ పొగుడుతున్నారు. చాలా భారీ పెట్టుబడితో సుమారు మూడేళ్ళు శ్రమించి నిర్మించిన ఆ చిత్రం విజయపధంలో దూసుకుపోతూ నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి కాసుల వర్షం కురిపిస్తోంది. త్వరలోనే రూ.500 కోట్లు కలెక్షన్స్ చేసి సినీ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు సినీ పండితులు సైతం దృవీకరిస్తున్నారు. మూడేళ్ళపాటు బాహుబలి సినిమా కోసం కష్టపడినందుకు మంచి ఫలితమే దక్కింది. ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే బాహుబలి రెండవ భాగం షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. మళ్ళీ అది పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. కానీ ఇప్పటికే అందులో కొంత భాగం షూటింగ్ చేయడం పూర్తయిన మాట నిజమయితే రెండవ భాగం షూటింగ్ పూర్తి చేయడానికి ఇంతకు ముందులాగ ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చును.
రెండవ భాగం గురించి ఒక ఆసక్తి కరమయిన వార్త ఒకటి వినిపిస్తోంది. దాని ఆంధ్రప్రదేశ్ హక్కులను సుమారు రూ.450 కోట్లకు రిలయన్స్ సంస్థ తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వినికిడి. దర్శక, నిర్మాతలు కూడా దానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆ విధంగా ముందే అగ్రిమెంటు కుదుర్చుకోవడానికి వేరే ఇతరత్రా ఆర్ధిక సమస్యలు, కారణాలు ఏమయినా ఉన్నాయా లేక రిలయన్స్ సంస్థ ఇస్తున్న ఈ భారీ ఆఫర్ ని చూసి వారు ‘టెంప్ట్’ అవుతున్నారో తెలియదు. కానీ ఒకవేళ రిలయన్స్ సంస్థకు రెండవ భాగం హక్కులను అమ్మేసినట్లయితే, మరి డిస్ట్రిబ్యూటర్ల మాటేమిటి? అనే సందేహం కలగడం సహజం. ఎందుకంటే వారు మొదటి భాగాన్ని ఆశించిన దానికంటే చాలా ఎక్కువ మొత్తాలే చెల్లించి హక్కులు కొనుకొన్నారు. ఆ సినిమా గురించి చాలా భారీ అంచనాలున్నందునే వారు అంత ‘రిస్క్’ తీసుకొన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు తీసుకొన్న ‘రిస్క్’ కి చెల్లించిన ‘ధర’కి సరయిన ప్రతిఫలమే దక్కింది. అందుకు వారు కూడా చాలా సంతోషిస్తున్నారు. కానీ ఇప్పుడు రిలయన్స్ సంస్థ ఏకంగా రూ.450 కోట్లు చెల్లించి పూర్తి హక్కులు కొనుకొన్నట్లయితే, అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.
బాహుబలి సినిమా విజయం సాధించడంలో ఆ సినిమా నిర్మాణం గొప్పగా ఉండటమే ఒక్కటే కారణం కాదు. ఆ సినిమాకు దర్శకుడు రాజమౌళి చేసిన వినూత్నమయిన ప్రచారం, సృష్టించిన ‘హైప్’, ఆ కారణంగా మీడియాలో, సోషల్ మీడియాలో దానిపై జరిగిన విస్తృత చర్చ, ఆ సినిమా గురించి ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయలు, ప్రభాస్ అభిమానుల హడావుడి వంటి అనేక అంశాలు ఆ సినిమా విజయానికి దోహదం చేశాయని చెప్పవచ్చును. అదేవిధంగా రెండు రాష్ట్రాలలో చాలా భారీ మొత్తాలు చెల్లించి ఆ సినిమా హక్కులను కొనుకొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ సినిమా విజయానికి కారకులేనని చెప్పవచ్చును.
కానీ మొదటి భాగం చూసిన తరువాత ఇంకా రెండవ భాగానికి ఎంతగా ప్రచారం చేసినా మొదట భాగంపై ప్రజలలో ఏర్పడిన ఆసక్తి, దానికి వచ్చినంత ‘హైప్’, అంచనాలు ఉండకపోవచ్చును. కనుక రిలయన్స్ సంస్థ కూడా ఒకవిధంగా రిస్క్ తీసుకొంటున్నట్లే భావించవచ్చును. కానీ రిలయన్స్ వంటి సంస్థకు అదేమీ పెద్ద రిస్క్ కాదు. కానీ ఈ నేపధ్యంలో రెండవ భాగానికి ఇంకా ఎక్కువ మొత్తం చెల్లించాలంటే డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం అది చాలా పెద్ద రిస్కే అవుతుంది. బాహుబలి మొదటిభాగం ఘన విజయం సాధించినందునే రిలయన్స్ సంస్థ అంత భారీ మొత్తం చెల్లించడానికి సిద్దపడిందని చెప్పవచ్చును.
కేవలం లాభార్జనతోనే రెండవ భాగంపై అంత పెట్టుబడి పెడుతోంది కనుక సహజంగానే మరో వందో రెండు వందలో కోట్లో లాభాలు ఆశించవచ్చును. ఆ అదనపు భారాన్ని డిస్ట్రిబ్యూటర్లే భరించక తప్పదు. తన సినిమా ఇంతగా విజయవంతం అవడానికి తోడ్పడిన డిస్ట్రిబ్యూటర్లను కాదని బాహుబలి దర్శక నిర్మాతలు రిలయన్స్ సంస్థకు తమ సినిమా రెండవ భాగం అమ్మడం న్యాయమేనా? ఇప్పటికే కొందరు పెద్ద నిర్మాతల చేతిలో చిక్కుకొని డిస్ట్రిబ్యూటర్లు విలవిలలాడుతున్నట్లు తరచూ వార్తలు వింటున్నాము. ఇప్పుడు వారిని ఏకంగా తిమింగలానికే అప్పజెప్పడం న్యాయమేనా? బాహుబలి దర్శక నిర్మాతలు ఆలోచించుకోవాలి. నేడో రేపో బాహుబలి కాదు…కాదు…డిస్ట్రిబ్యూటర్లు ఎవరి చేతిలో పడబోతున్నారో తెలిసే అవకాశం ఉంది.