కాంగ్రెస్ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో నిరసన తెలియజేస్తుందని అందరూ ఊహించిందే. ఊహించినట్లుగానే ఈరోజు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి దానిపై చర్చ జరపాలని రాజ్యసభ కార్యక్రమాలను స్తంభింపజేశాయి. సుప్రీం కోర్టు విచారిస్తున్నప్పుడు సభలో దానిపై చర్చించలేమని చెపుతూ కేంద్రప్రభుత్వం చాలా తెలివిగా తప్పించుకొంది. కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దానిపై సభలో చర్చ జరపాల్సిందేనంటూ పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకి వాయిదా పడింది.
ఈ విషయంలో కేంద్రప్రభుత్వం వాదన సహేతుకంగానే కనిపిస్తున్నప్పటికీ, సభలో దానిపై చర్చ చేపట్టడానికి ఇబ్బందేమీ ఉండదు. ఇదివరకు వివిధ కేసులు న్యాయస్థానాలలో ఉన్నప్పుడే అనేకసార్లు ఉభయసభలలో దానిపై చర్చలు జరిపారు కనుక ఈ అంశంపై కూడా సభలో చర్చించవచ్చు కానీ ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వానికి ఇప్పటికే తలబొప్పి కట్టి ఉన్నందున, సభలో చర్చకు అనుమతిస్తే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉందనే సాకుతో తప్పించుకొందని చెప్పవచ్చు. కానీ ఈ కేసును ఏప్రిల్ 27న సుప్రీం కోర్టులో విచారణ జరుగబోతోంది కనుక ఇవ్వాళ్ళ ప్రతిపక్షాల బారి నుంచి తప్పించుకొన్నా బుధవారం తప్పించుకోలేదు.
ఒకవేళ సుప్రీం కోర్టు హరీష్ రావత్ కి శాసనసభలో మెజారిటీ నిరూపించుకొనే అవకాశం కల్పించితే కేంద్రప్రభుత్వానికి అదొక చెంపదెబ్బ, ఒకవేళ హరీష్ రావత్ మెజార్టీ నిరూపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మరొక చెంపదెబ్బ అవుతుంది. ఈ 5 రోజులలో ఉత్తరాఖండ్ లో మళ్ళీ రాష్ట్రపతి పాలన విదించబోమని అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వద్ద సుప్రీం కోర్టు లిఖిత పూర్వకంగా హామీ తీసుకోవడం గమనిస్తే, అది కూడా రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తోందని అర్ధమవుతోంది. కనుక ఏవిధంగా చూసినా ఈవ్యవహారంలో కేంద్రప్రభుత్వానికి మరింత అవమానాలు తప్పకపోవచ్చు.