టి-కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు పాలేరు ఉపఎన్నికల బరిలో నుంచి తెదేపా తప్పుకొంటుంనట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. మొన్నటివరకు నామా నాగేశ్వర రావుని నిలబెట్టాలనుకొంటున్నట్లు చెప్పుకొన్న తెదేపా అకస్మాత్తుగా బరిలో నుంచి మంచి కారణం చూపే తప్పుకొని తన గౌరవాన్ని కాపాడుకొంది. కాకపోతే అది తెదేపా దైన్యస్థితికి అద్దం పడుతోంది. ఒకప్పుడు అందరూ తెదేపా టికెట్ కోసం ఎగబడేవారు కానీ ఇప్పుడు టికెట్ ఇచ్చి ఎక్కడ పోటీ చేయమంటుందోనని అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు లేదా ఇంక ఏ ఎన్నికలలోనూ తెదేపా పోటీ చేయకపోయినా ఆశ్చర్యమే లేదు. కానీ ఇటువంటి పరిస్థితులు ఆ పార్టీలో ఇంకా కొనసాగుతున్నవారి రాజకీయ భవిష్యత్ ని ప్రశ్నార్ధకంగా మార్చేయవచ్చు.
ఈ ఉపఎన్నికలలో తెదేపా పోటీ చేయకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ తెలంగాణాలో తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని, వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పుకొంటున్న భాజపా ఈ ఉపఎన్నికలలో ఎందుకు పోటీ చేయడంలేదో తెలియదు. తెదేపాతో పొత్తుల కారణంగానే తమకు రాష్ట్రంలో తీరని నష్టం జరిగిందని చెప్పుకొంటూ తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకొంటున్న భాజపా అది నిజమని నిరూపించుకొనేందుకు ఈ ఉపఎన్నికలు ఒక మంచి అవకాశంగా భావించి పోటీ చేసి తమ సత్తా చాటుకోవచ్చు కానీ రాష్ట్ర భాజపా నేతలెవరూ అసలు ఎన్నికల ఊసే ఎత్తకపోవడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా హుషారుగా పోటీకి దిగుతోంది. బహుశః సానుభూతి ఓటు కారణంగా తామే తప్పకుండా గెలుస్తామనే నమ్మకం కావచ్చు, తెరాస తప్ప మరే పార్టీ బరిలో లేకపోవడం దానికి కారణం కావచ్చు. కారణాలు ఏవయినా టి-కాంగ్రెస్ నేతలు తమ పోరాట స్ఫూర్తిని కోల్పోలేదని ఇది స్పష్టం చేస్తోంది. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్, తెదేపా, భాజపాల వైఖరిలో ఈ తేడాను గమనిచినట్లయితే ఎప్పటికయినా రాష్ట్రంలో తెరాసకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం కాగలదు తప్ప తెదేపా, భాజపాలు కావని స్పష్టం అవుతోంది.