సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ ఇచ్చిన షాక్‌లోంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్నాడు పవన్ కల్యాణ్. ఆ సినిమాని భుజాలపై మోసుకొని తన వంతుగా చేయాల్సిందంతా చేశాడు. సినిమా అయిపోయాక మీడియా ముందు ఎప్పుడూ రాని పవన్.. ఈసినిమా కోసం ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఎంత చేసినా… నష్టాల నుంచి తన బయ్యర్లను కాపాడలేకపోయాడు. వాళ్లను ఆదుకోవడానికి ఓ సినిమా చేయాలిప్పుడు. పవన్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈనెల 29న పవన్ కొత్త సినిమా మొదలుకాబోతోంది. అదే రోజు.. చిరంజీవి కత్తి సినిమా రీమేక్‌కీ ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. అంటే అన్నయ్య బాటలోనే తమ్ముడూ నడుస్తున్నాడన్నమాట.
ఎస్.జె. సూర్య చెప్పిన ఓ కథకు పవన్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. అయితే.. ఈనెల 29 దాటితే మంచి ముహూర్తాలు లేవట. అందుకే… ఆ రోజు సినిమాని లాంఛనంగా ప్రారంభిద్దామని చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ రోజు పూజా కార్యక్రమాలు జరిపి వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లిపోవాలని పవన్ భావిస్తున్నాడు. ఓకేరోజు చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల సినిమాలు మొదలవుతున్నాయి మరి. మెగా ఫ్యాన్స్‌కి పండగే ఇక.