పఠాన్ కోట్ దాడుల తరువాత స్తంభించిపోయిన భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ దారిన పడుతున్నట్లున్నాయి. జనవరిలో జరుగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం పఠాన్ కోట్ దాడుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలు గడిచిపోయినా ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఆ విషయంలో పాక్ చాలా చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మోడీ ప్రభుత్వం పాక్ తో చర్చలకే సిద్దపడుతున్నట్లుంది. పాక్ విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి నేతృత్వంలో పాక్ సౌత్యవేత్తల బృందం డిల్లీలో జరుగబోయే ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం డిల్లీకి వస్తోంది. తాలిబాన్ ఉగ్రవాదుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆఫ్ఘనిస్తాన్ దేశంలో శాంతి నెలకొల్పేందుకు అవసరమయిన చర్యల గురించి చర్చించేందుకు 2011 నుంచి ప్రతీ ఏటా ఈ సదస్సు ఒక్కో దేశంలో నిర్వహించబడుతోంది. ఈసారి ఏప్రిల్ 26న డిల్లీలో నిర్వహింపబడుతోంది.
ఈ సదస్సులో పాల్గొనడానికి వస్తున్న పాక్ బృందం ఆ సందర్భంగా వారు భారత్ విదేశాంగ ప్రధాన కార్యదర్శి ఎస్. జైశంకర్ తో సమావేశమవుతారు. ఇది పూర్తి స్థాయి విదేశాంగ కార్యదర్శుల సమావేశం కాకపోయినా, అది భవిష్యతులో పూర్తి స్థాయి సమావేశానికి నాంది పలికేదేనని పాక్ చెపుటోంది. వారి వ్యాఖ్యలను భారత్ అంగీకరించలేదు అలాగని ఖండించకుండా మౌనం వహించింది. అంటే మౌనం అర్ధాంగీకారంగా భావించవచ్చు. రేపు ఇరుదేశాల కార్యదర్శులు, దౌత్య బృందాల మధ్య జరిగే సమావేశంలో ద్వైపాక్షిక సబంధాల గురించి చర్చించవచ్చునని ఐజాజ్ అహ్మద్ చౌదరి చెపుతున్నారు. భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్దరించుకోవడానికి రేపటి సమావేశం ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
రేపటి సమవేశంలో భారత్ విదేశాంగ ప్రధాన కార్యదర్శి ఎస్. జైశంకర్ పఠాన్ కోట్ దాడుల గురించి ప్రస్తావించి, పాక్ లో దర్యాప్తు జరిపేందుకు భారత్ ఎన్.ఐ.ఏ. బృందాన్ని అనుమతించవలసిందిగా కోరవచ్చును.