తెదేపా ఎంపి డా.శివ ప్రసాద్ చిత్రవిచిత్ర వేషాల గురించి అందరికీ తెలిసిందే. ‘ఎవరేమనుకొంటే నాకేమిటన్నట్లు’ ఆయన విచిత్ర వేషధారణతో పార్లమెంటుకి వచ్చి తన నిరసనలు తెలియజేస్తుంటారు. ఈసారి ఆయన కుచేలుడి వేషం కట్టారు. శ్రీకృష్ణుడు వంటి ప్రధాని నరేంద్ర మోడి దయ తలిచి రాష్ట్రానికి తగినన్ని నిధులు విడుదల చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన దెబ్బ నుంచి కోలుకోలేదని చెపుతూ ఆయన కుచేలుడి వేషంలో వచ్చి ‘ఇంతింత..ఇంతింత విదిలించినట్లుంటే, ఆ లోటు ఎప్పుడు పూడునో…ఆంధ్ర తలరాత ఎప్పుడు మారునో కదా’ అంటూ పద్యం కట్టి పాడారు.
ఆయన స్వతహాగా నటుడు కనుక తనకు తెలిసిన పద్ధతిలోనే నిరసనలు తెలియజేయడం బాగానే ఉంది కానీ దాని వలన ఉత్తరాది ఎంపిలు, మంత్రుల ముందు చులకనవ్వడం తప్ప ఆయన సాధించింది ఏముంది అంటే ఏమీ లేదనే చెప్పవచ్చు. ఇదివరకు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కూడా ఆయన రకరకాల వేషాలు కట్టి తన నిరసన తెలిపారు. దాని వలన ఆయన నటనా ప్రతిభ ప్రదర్శించుకోగలిగారు కానీ రాష్ట్ర విభజన ఆపలేకపోయారు. పైగా రాష్ట్ర ప్రజలు అందరూ చాలా ఆవేదనతో, ఆందోళనతో రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తుంటే, పార్లమెంటులో నిలబడి వారి గళాన్ని గట్టిగా వినిపించి ప్రభుత్వంతో పోరాడవలసిన ఆయన, బయట రకరకాల వేషాలు వేస్తూ అందరికీ వినోదపరచడం ప్రజలని అపహాస్యం చేయడమే.
ఆయన కళాకారుడే కావచ్చు కానీ తన ప్రతిభ ప్రదర్శించడానికి పార్లమెంటు వేదిక కాదని గుర్తించడం లేదు. పార్లమెంటులో ప్రజా సమస్యల గురించి గట్టిగా మాట్లాడి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించి, సాంస్కృతిక కార్యక్రమాలలో తన కళా ప్రతిభని ప్రదర్శించి ఉండి ఉంటే, ఎవరూ ఆయనని ఈవిధంగా విమర్శించి ఉండేవారు కాదు. పార్లమెంటు సభ్యుడిగా ఎంతో హుందాగా వ్యవహరించవలసిన ఆయన రకరకాల వేషాలతో వెళ్లి ప్రదర్శన ఇవ్వడం ఎవరూ హర్షించలేరు. ఆయన ఉద్దేశ్యం ప్రజా సమస్యల గురించి కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడమే కావచ్చు కానీ ఆయన వేస్తున్న వేషాలతో ప్రజలకు, ప్రభుత్వానికి కూడా తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. ఆయన సమస్యల గురించి కాక నలుగురి ముందు తన ప్రతిభను ప్రదర్శించి వారిచే ‘శబాష్’ అనిపించుకోవడానికే ఆవిధంగా చేస్తున్నాన్నారనే అభిప్రాయం ప్రజలకు కలిగిస్తున్నారు.
ఆయన ఎన్ని వేషాలు వేసినా ఎంపిగా తన నియోజక వర్గ సమస్యలని పరిష్కరించి, అన్ని విధాలా దానిని అభివృద్ధి చేయగలిగితే పరువాలేదు. లేకుంటే వచ్చే ఎన్నికల తరువాత ఆ నాటకాలతోనే కాలక్షేపం చేసుకోవలసి వస్తుందని గ్రహిస్తే మంచిది.