మినీ ఎన్నికలుగా మీడియా పేరుపెట్టిన అస్సాం, తమిళనాడు, పాండిచేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో అంచనా అందేస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా జనబాహుళ్యంలో పెద్దగా ఆసక్తీ కుతూహలాలూ లేవు. అస్సాంలో మినహా ఏరాష్ట్రం మీదా బిజెపి ఆశలు పెట్టుకోలేదు కూడా.
స్వయం కృషితో ప్రధానమంత్రి అయిన నరేంద్రమోదీకి మించి జనాకర్షణ వున్న నాయకుడు బిజెపిలో లేరు. ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తోంది. మోదీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ, ఆర్ధిక విధానాల మధ్య పరస్పర వైరుధ్యాల వల్ల బిజెపి మీద పెద్దగానే అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఢిల్లీ, బీహార్, ఎన్నికల తరువాత బిజెపి ఎన్నికల ముఖచిత్రం నుంచి మోదీ చిన్నచిన్నగా వెనక్కి వెళ్ళిపోయారు.
ఆర్ధిక విధానాలలో మాతృసంస్ధ ఆర్ ఎస్ ఎస్ ను తన దారికి తెచ్చుకోగలిగిన మోదీ – సాంస్కృతిక, మత పరమైన విధానాలలో మాతృసంస్ధను ఆధునీకరించలేకపోతున్నారు. కవులు రచయితలు అవార్డులు వాపసు ఇవ్వడం, వేముల రోహిత్ ఆత్మహత్య, కన్హయ్య అరెస్టు సంఘటనల వెనుక రెండు భిన్న భావజాలాల ఘర్షణ వుంది. మోదీ ఆందులో చిక్కుకోకుండా మౌనం పాటించారు. అలాగే కొనసాగిస్తున్న మౌనం ద్వారా మత పరమైన అంశాలలో తాను తటస్ధుడిని అనే సంకేతాన్ని ప్రజలముందు వుంచే ప్రయత్నం వుంది. అవినీతి ఆరోపణలు లేకపోవడం కూడా మోదీ వ్యక్తిగత గౌరవ ఆదరాలు దిగజారకపోవడానికి ఒక కారణం. ఏది ఏమైనా మోదీ వ్యక్తిగత గ్రాఫు అధకారంలోకి వచ్చిన నాటి కంటే ఇప్పుడు పడిపోయిందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో తమిళనాడు, పాండిచేరిలలో గెలిచినా ఓడినా ద్రవిడపార్టీలకే తప్ప జాతీయ పార్టీలకు చోటు లేదు. హిందూత్వ భావనలు విస్తరిస్తూన్న నేపధ్యంలో వామపక్షాలకు బలమూ, పట్టూ వున్న పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో దాన్ని కౌంటర్ చేయాలన్న ఒక నూతనోత్సాహం కనబడుతోంది. బెంగాల్, కేరళల్లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక మోస్తరు ఓటింగ్‌ను సాధించిన బిజెపి, ప్రస్తుత ఎన్నికల్లో ఉనికి కాపాడుకోడానికి తంటాలు పడుతోంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో 17 శాతం ఓట్లు, రెండు ఎంపి స్థానాలు, కేరళలో పది శాతం ఓట్లు, అస్సాంలో ఏడు ఎంపి సీట్లు, తమిళనాడులో ఒక ఎంపి స్థానాన్ని గెలుచు కుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ మేరకైనా బిజెపి ప్రభావం ఓట్లు, సీట్లపై లేకపోతే ఆయా రాష్ట్రాల్లో బిజెపి ఉనికి నామమాత్రంగా కూడా మిగలదు.
ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు, అభ్యుదయ, ప్రగతిశీల శక్తుల దృష్టి కేరళ, బెంగాల్ రాష్ట్రాలపైనే ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో వామపక్షాలు మళ్ళీ అధికారం లోకి వస్తే మోడీని ఎదుర్కొనే శక్తి పెరుగు తుందని భావిస్తున్నారు.
మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హింస దౌర్జన్యాలు పెరిగాయి. దీంతో పాతరోజులే మెరుగు అన్న భావన వ్యాపిస్తోంది. ఇది వామ పక్షాలు పుంజుకునే పరిస్థితే!
నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఇంతకుముందెన్నడూ లేనంత తీవ్రంగా హిందూత్వ ప్రభావం దేశవ్యాప్తంగా కనబడుతున్న నేపధ్యంలో కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రల్లో వామపక్షాల అండదండలతో సెక్యులరిస్టులు ఏకమౌతూండటమే ఈ ఎన్నికల విశేషం! బిజెపి, వామపక్షాల ముఖాలు తొడుక్కున్న రెండు భావజాలాలు తలపడుతున్న ఈ ఎన్నికల్లో హిదూత్వం సెక్యులరిజాన్ని నిలువరిస్తుందా? సెక్యులరిజం హిందూత్వను నిలువరిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న! ఫలితాల్లో వెల్లడయ్యే సమాధానాలను బట్టే ఈ రెండు భావజాలాల భవిష్యత్తు ఎత్తుగడలూ, వ్యూహాలూ వుంటాయి.