తెలంగాణా మంత్రివర్గంలో నిన్న చేసిన కొన్ని మార్పులు, చేర్పులలో ముఖ్యమంత్రి మేనల్లుడు మంత్రి హరీష్ రావు నిర్వహిస్తున్న కొన్ని శాఖలను వెనక్కి తీసుకోవడం విశేషం. ఆయన నిర్వహిస్తున్న గనులు, భూగర్భ వనరులు, సహాకార శాఖలను వెనక్కి తీసుకొని, సాగునీటి ప్రాజెక్టులు, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖలను ఉంచేరు. తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులను హరీష్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కారణంగా ఆయనపై పనిభారం కొంత తగ్గించే ఉద్దేశ్యంతోనే ఆయన అభ్యర్ధన మేరకే ఆ మూడు శాఖలను వెనక్కి తీసుకొన్నట్లు సమాచారం.
తెలంగాణా ఏర్పాటు కోసం కేసీఆర్ తో సమానంగా ఉద్యమాలు చేసిన హరీష్ రావుకి, రాష్ట్రంలో తెరాస అధికారం చేపట్టిన తరువాత చాలా కీలకమయిన శాఖలు అప్పగించినప్పటికీ, ఆ తరువాత క్రమంగా పార్టీలో, ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత తగ్గుతున్నట్లు నిరూపించే పరిణామాలు చాలా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకు కె.టి.ఆర్.ని తన రాజకీయ వారసుడిగా ముందుకు తీసుకురావడానికే, హరీష్ రావుతో సహా పార్టీలో ముఖ్యమయిన నేతలందరి ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. పార్టీలో ఏర్పడుతున్న ఈ మార్పులు, జరుగుతున్న ఈ పరిణామాల పట్ల మంత్రి హరీష్ రావు కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ హరీష్ రావు ఏనాడు వాటిని ఖండించకపోవడం గమనార్హం. ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా ముందుకి తీసుకువద్దామనుకొన్నప్పుడు, జూ.ఎన్టీఆర్ అతనికి సవాలుగా మారీ ప్రమాదం ఉందనే భయంతో, అతనిని క్రమంగా పార్టీ నుంచి దూరం చేసినట్లుగానే, కె.టి.ఆర్.కి హరీష్ రావు నుంచి సవాలు ఎదురవకుండా ఉండేందుకే పార్టీలో, ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యతని క్రమంగా తగ్గిస్తున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన నుంచి కీలకమయిన మూడు శాఖలను వెనక్కి తీసుకొన్నారు. ఇది ఆయన అభ్యర్ధన మేరకే జరిగినట్లు చెపుతున్నప్పటికీ, దాని వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ నేతల్లో నెలకొన్న ఆ అసంతృప్తి బయటపడింది. తామంతా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమే కానీ ఆయన వారసుల నాయకత్వంలో కాదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి ఆదేశించారు కనుకనే పాలేరు ఉపఎన్నికలలో పోటీ చేస్తున్నాను తప్ప కోరుండి కాదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు పట్ల ఆ పార్టీలో మొట్టమొదటిసారి బహిరంగంగా వినపడిన అసంతృప్తి స్వరం ఇది.