ముంబై ప్రేలుళ్ళతో సహా అనేక తీవ్రమయిన నేరాలలో ‘మోస్ట్ వాంటడ్ క్రిమినల్’ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యానికి గురయినట్లు తాజా సమాచారం. మధుమేహం, రక్తపోటు వ్యాధుల కారణంగా అతని రెండు కాళ్ళకు రక్త సరఫరా నిలిచిపోవడంతో అక్కడి కణజాలం కుళ్ళిపోయింది. అ కారణంగా రెండు కాళ్ళు తీసివేసేయాల్సి రావచ్చునని సమాచారం. శరీరంలో మిగిలిన అవయవాలకు కూడా రక్తం సరఫరా నిలిచిపోవడంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సి.ఎన్.ఎన్.న్యూస్-18 బయటపెట్టింది. అతనికి సోకిన గ్యాంగ్రీన్ వ్యాధి శరీరమంతా వ్యాపించడం చేత బ్రతికే అవకాశాలు లేన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతను పాకిస్తాన్ లోని కరాచీలో లియాఖత్ జాతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సి.ఎన్.ఎన్. పేర్కొంది. మరో విశేషం ఏమిటంటే అతనికి ఆ ఆసుపత్రిలో వైద్యులు కాక, పాకిస్తాన్ ఆర్మీ వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సి.ఎన్.ఎన్. పేర్కొంది. ముంబై ప్రేలుళ్ళ కేసులో నిందితుడిగా ఉన్న అతనిని అప్పజెప్పమని భారత్ కోరినప్పుడు, అతను తమ దేశంలో లేడని పాకిస్తాన్ వాదించింది. కానీ అతను పాక్ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడని ఇది నిరూపిస్తోంది. అంతే కాదు అటువంటి కరడుగట్టిన నేరస్తుడు, భారత్ ప్రేలుళ్ళకు కుట్రలు పన్నిన వ్యక్తిని పాక్ దాచిపెట్టి, అతనిని రక్షించాలనుకోవడం పాక్ ద్వంద వైఖరికి అద్దం పడుతోంది. ఒకవేళ అతను నిజంగానే చనిపోతే, అతనిని పట్టుకొని విచారించేందుకు ఇంకా భారత్ శ్రమ పడనవసరం లేదు అలాగే అతనిని విచారించేందుకు భారత ప్రజల కష్టార్జితాన్ని (ప్రజాధనం) వృధా చేయనవసరం లేదు. అంత కరడుగట్టిన నేరస్తుడుకి దేవుడే సరయిన శిక్ష విదిస్తున్నాడనుకోవచ్చు. లేకపోతే కోటీశ్వరుడయిన అతనికి ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ ఈవిధంగా ఘోరమయిన చావు చావబోవడం దైవలీల కాకపోతే మరేమిటి?