మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చాలా ఆసక్తికరమయిన విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2026 సం.వరకు శాసనసభ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని తెలిపారు. అంతవరకు సీట్ల పెంపుపై రాజ్యాంగంలో సీలింగ్ విధించబడి ఉంది కనుక సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయాన్నీ ఆయన డిల్లీలో సాక్షి మీడియాకి తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది.
ఇంకా దీని గురించి ఆయన ఏమని చెప్పారంటే, “జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత దానికీ ఇదే సమస్య వచ్చింది. జార్ఖండ్, కేరళ రాష్ట్రాలలో ఇంచుమించి సరిసమానంగా జనాభా ఉన్నప్పటికీ జార్ఖండ్ శాసనసభలో కేవలం 81 సీట్లే ఉండగా, కేరళలో మాత్రం 140 ఉన్నాయి. కనుక జార్ఖండ్ లో కూడా మరో 59 సీట్లు పెంచాలని నేను రెండేళ్ళ పాటు గట్టిగా కృషి చేసినా, ఆ 2026 సీలింగ్ కారణంగానే అది సాధ్యపడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. విభజన చట్టంలో సెక్షన్-26 ఆర్టికల్ 170కి లోబడి చట్ట సవరణ చేయడం ద్వారా సీట్లు పెంచుకొనే అవకాశం ఉంది. అయితే అందుకు అన్ని రాజకీయ పార్టీలు సమ్మతించి, సహకరించాల్సి ఉంటుంది. అప్పుడే అది సాద్యం అవుతుంది. కానీ దేశంలో చాలా రాష్ట్రాల నుంచి అసెంబ్లీ సీట్ల పెంపుకి డిమాండ్లు వస్తున్నందున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకి మాత్రమే సీట్లు పెంచడం సాధ్యం కాకపోవచ్చు. దీనిపై పార్లమెంటరీ శాఖ మంత్రి వెంకయ్య నాయుడే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఏమయినప్పటికీ రెండు రాష్ట్రాలలో సీట్లు పెరుగబోతున్నాయనే ప్రచారంతో పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం సరి కాదు,” అని జైరాం రమేష్ అన్నారు.