ఒకప్పుడు తెదేపాకి ‘ఈనాడు’ అ(న)ధికారిక న్యూస్ పేపర్ గా ఉండేది కానీ రామోజీరావు-ప్రధాని నరేంద్ర మోడీ, జగన్, కేసీఆర్ లకు సన్నిహితం అయిన తరువాత నుంచి తెదేపా పట్ల ఈనాడు వైఖరిలో కొంచెం మార్పు కనబడుతోంది. బహుశః ఆ అవకాశాన్ని వినియోగించుకొని దాని స్థానాన్ని ఆంధ్రజ్యోతి తీసుకొన్నట్లు కనిపిస్తోంది. సాక్షిలో వచ్చే వార్తలు వైకాపా ఆశయాలు, ఆలోచనలు, వ్యూహాలకు ఏవిధంగా అద్దం పడుతుంటాయో, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలను తెదేపా ఆలోచనలు, అభిప్రాయాలకు, వ్యూహాలను ప్రతిభింబిస్తుండటం గమనించవచ్చు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో “ఏపికి బిపి…చుక్కలు చూపిస్తున్న కేంద్రం” అనే శీర్షికన ప్రచురించిన ఒక కధనం చంద్రబాబు నాయుడు మనసులో మాటలని బయటకి చెపుతునట్లుంది.
దానిలో కేంద్రం నుంచి రెవెన్యూ లోటు భర్తీకి రూ. 16300 కోట్లు విడుదల కావలసి ఉంటే ఇంతవరకు కేవలం రూ. 2,800 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, ఏమని అడిగితే కేంద్ర ప్రభుత్వ అధికారులు రకరకాల ప్రశ్నలు వేసి ఫైళ్ళపై కొర్రీలు వేస్తున్నారని పేర్కొంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా రంద్రాన్వేషణ చేస్తూ తప్పించుకొనే ఆలోచనలో ఉన్నట్లు కనబడుతోందని పేర్కొంది. అలాగే రైతులకు రుణమాఫీ చేయడంపై కూడా కేంద్రప్రభుత్వం అభ్యంతరం తెలపడం తప్పు అన్నట్లుగా ఆ కధనంలో వ్రాసింది. గత ఐదారేళ్ళుగా పరిశ్రమలకు చెల్లించవలసిన రాయితీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి, ఆ ఖర్చును రెవెన్యూ లోతుగా చూపడాన్ని కూడా కేంద్రం తప్పు పడుతోందని పేర్కొంది. అలాగే సంక్రాంతి, రంజాన్ పండుగల సందర్భంగా ‘చంద్రన్న కానుకల’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం డబ్బు దుబారా చేసినట్లు కేంద్రం భావిస్తోందని అ కధనంలో పేర్కొంది.
రైతులకు రుణమాఫీ, పరిశ్రమలకు రాయితీలు, ప్రజలకు చంద్రన్న కానుకలు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో వివరించి, అది కూడా పాపమేనా? అని ఆ కధనంలో ప్రశ్నించడం చంద్రబాబు నాయుడే అడుగుతునట్లే ఉంది. హూద్ హూద్ తుఫాను సహాయం పూర్తిగా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జి.ఎస్.డి.పి.కి కుదించి బయట నుంచి కూడా అప్పులు తెచ్చుకోలేని పరిస్థితులు కల్పించి ‘అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వద్దు’ అన్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించింది.
తెదేపా-భాజపాల మధ్య క్రమంగా దూరంగా పెరుగుతునందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన ముందున్న అన్ని మార్గాల ద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. అయితే ఇప్పటికీ కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే పనులు చక్కబెట్టుకోవాలని కోరుకొంటున్నారు కానీ కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా, లెక్కలు అడుగుతుండటంతో చంద్రబాబు నాయుడిలో అసహనం పెరుగుతున్నట్లుంది. ఆయన మాటలలో కొద్దికొద్దిగా అది బయటపడుతోంది. అదే మీడియా ద్వారా అయితే చెప్పదలచుకొన్నదంతా నిర్భయంగా చెప్పవచ్చు. కనుక ఆయన చెప్పదలచుకొన్నదే ఆంధ్రజ్యోతి ద్వారా బయటపెడుతున్నట్లుంది. రాష్ట్ర భాజపా నేతల ద్వారా అది కేంద్రానికి చేరకపోదు. అప్పటికీ కేంద్రప్రభుత్వం వైఖరి మారకపోతే భాజపాతో తెదేపాయే తెగతెంపులు చేసుకొన్నా ఆశ్చర్యం లేదు.