వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ప్రస్తుతం డిల్లీలో చాలా హడావుడి చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రధాన సమస్య ‘వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపజేయడం.’ అందుకు చంద్రబాబు నాయుడు ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20-40 కోట్లు వరకు చెల్లిస్తున్నారని లేకుంటే మంత్రి పదవులో మరొకటో ఆఫర్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తెదేపా చేస్తున్న ఆ పనిని ప్రజాస్వామ్యంపై నమ్మకమున్నవారు ఎవరూ సమర్ధించలేరు. కనుక ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వాదనలతో ఏకీభవించవలసిందే. అయితే, పనిగట్టుకొని డిల్లీ వెళ్లి తెదేపా ప్రభుత్వంపై కేంద్రానికి పిర్యాదు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి అదే తప్పు చేస్తున్న తెరాస కనబడలేదా?అనే సందేహం కలుగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ ఫారూక్, ఖమ్మం జిల్లాకి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలని నిన్న పార్టీలో చేర్చుకొంటున్నప్పుడు “ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరడం చిల్లర రాజకీయాలు కాదు. రాజకీయ శక్తుల పునరేకీకరణ. బంగారి తెలంగాణా సాధన కోసమే అందరం మాతో చేతులు కలపాలని కోరుతున్నాము. కొత్తగా పార్టీలో చేరుతున్న ఫారూక్ హుస్సేన్ నాకు చిరపరిచితుడు. అతనికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తాను,” అని సభా ముఖంగా హామీ ఇచ్చారు. అంటే పార్టీ ఫిరాయింపులకి ఆయనే వేరే పేరు పెట్టుకొన్నా వాటిని తప్పకుండా ప్రోత్సహిస్తామని స్వయంగా ప్రకటిస్తునట్లే. పార్టీలో చేరేవారికి పదవులు ఇస్తామని ఆయన బహిరంగంగానే చెప్పారన్న మాట.
కానీ జగన్ దానిపై ఎన్నడూ స్పందించరు. తెలంగాణా రాజకీయ వ్యవహారాలతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదనుకోవడానికి కూడా వీలులేదు. తెలంగాణాలో కూడా వైకాపా ఉంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను తెరాస తీసుకుపోయింది. దాని గురించి వైకాపా కొంత పోరాటం కూడా చేసింది. వరంగల్ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధి తరపున జగన్ ప్రచారం చేసారు. పాలేరు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నారు. మరి అటువంటప్పుడు తెదేపా చేస్తున్న తప్పునే తెరాస కూడా చేస్తున్నప్పుడు దాని గురించి జగన్ నోరు మెదపరెందుకు? సాక్షి మీడియాలో కూడా దానిపై ఎందుకు స్పందించదు? తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో ఫిరాయింపులను గట్టిగా ఖండిస్తుంటే అక్కడి వైకాపా నేతలు ఎందుకు నోరు మెదపటం లేదు? తెలంగాణా రాజకీయ పరిణామాలపై జగన్ స్పందించకపోయినా అక్కడి వైకాపా నేతలు స్పందించవచ్చు కదా? కానీ వారిని కూడా జగన్ ఎందుకు మాట్లడనీయడం లేదు? అంటే అక్కడ ఉన్నదీ అసమదీయులు ఇక్కడ ఉన్నదీ తసమదీయులు కనుక అని సరిపెట్టుకోవాలేమో?
వైకాపాకు ఆంధ్రాలో తన మనుగడ కాపాడుకొని ఏదో ఒకరోజు అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటున్నారు కనుక ఆ కలలను తెదేపా భగ్నం చేస్తుంటే ఆక్రోశిస్తున్నారు. కానీ తెలంగాణాలో పేరుకే పార్టీ ఉంది. అక్కడ అది ఉన్నా లేకున్నా ఆయనకు తేడా ఏమీ లేదు కనుకనే అక్కడ అసమదీయులని ఇబ్బంది పెట్టకుండా మౌనం వహిస్తున్నారనుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక చోట అనైతికమైనది ఇంకొక చోట నైతికంగా, ఆమోదయోగ్యం కనిపిస్తోందన్న మాట! ఈ ద్వంద వైఖరే ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చేస్తోంది. అదే ఆయన పార్టీని దెబ్బ తీస్తోంది.