వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకొని ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు తెదేపా నేతలు భుజాలు చరుచుకొంటున్నప్పటికీ, వారి చేరికతో పార్టీలో లుకలుకలు మొదలవుతున్నాయనే సంగతి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. నిజానికి సార్వత్రిక ఎన్నికలు పూర్తయేసరికే తెదేపా ‘హౌస్ ఫుల్’ బోర్డు పెట్టేసింది. అందుకే ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలు తెదేపాలో చేరడానికి ఆసక్తి చూపించినా, చాలా రోజుల వరకు ఎవరికీ పార్టీలోకి స్వాగతం పలకలేదు. బయట నుండి ఎవరూ రాకపోయినప్పటికీ కృష్ణా, గుంటూరు జిల్లాలలో పార్టీలో నేతలు ఎక్కువవడంతో, అప్పుడప్పుడు వారిలో వారే కీచులాడుకొనేవారు. ఇప్పుడు ప్రతీ జిల్లా నుంచి వైకాపా ఎమ్మెల్యేలు కూడా వచ్చి పార్టీలో చేరుతుండటంతో వారితో కూడా ఘర్షణలు అనివార్యం అవుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో అద్దంకి వైకాపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఈనెల 28న తెదేపాలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆయన చేరికను జిల్లాకే చెందిన సీనియర్ నేత కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలం తాము జిల్లాలో ఎవరితో పోరాడుతున్నామో వారినే పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనే తప్పని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది దోచుకొన్న డబ్బుని కాపాడుకోనేందుకే అధికారంలో ఉన్న తెదేపాలో చేరుతున్నారని అన్నారు. పదేళ్ళపాటు తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు పడ్డారని, అయినా పార్టీకి అండగా నిలబడి పోరాడి మళ్ళీ అధికారం సాధించుకొన్నారని బలరాం అన్నారు. ఇప్పుడు తెదేపా అధికారంలోకి రాగానే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు ఇతరపార్టీల నేతలు, ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కొత్తగా వచ్చినవారు ఇప్పుడు జిల్లాలో, నియోజకవర్గాలలో పెత్తనం చేలాయిస్తుంటే చూస్తూ కూర్చోలేమని అన్నారు. కార్యకర్తల అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నిర్మొహమాటంగా వివరిస్తానని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒకసారి బలరాంతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు కానీ ఆయన సంతృప్తి చెందలేదు. బహుశః రేపు ఆయన చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడినప్పుడు మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చు. చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బలరాం చెపుతున్నారు కనుక గొట్టిపాటి రాకను అయిష్టంగానయినా అంగీకరించవచ్చు.