డివైడ్ టాక్ వస్తే సినిమా పని అయిపోయినట్టే లెక్క. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమవుతారు. దాంతో వసూళ్లు పడిపోతాయి. కానీ.. సరైనోడుకి ఈ సీన్ రివర్స్ అయ్యింది. గత శుక్రవారం విడుదలైన సరైనోడికి డివైడ్ టాక్ స్వాగతం పలికింది. ఈసినిమా మరీ రొటీన్‌గా ఉందని, యాక్షన్ టూమచ్‌గా ఉందని విమర్శకులు పెదవి విరిచారు. అయితే తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టింది. రూ.11 కోట్లతో బన్నీ కెరీర్లోనే బెస్ట్‌గా నిలిచింది. మూడు రోజుల తరవాత.. సరైనోడు వసూళ్లు డౌన్ అవుతాయని, సోమవారం నుంచి భారీగా పడిపోతాయని భావించారు. అయితే.. అదేం జరగలేదు. సరికదా, సోమవారం కూడా థియేటర్లు నిండాయి.
మంగళవారం మార్నింగ్ షోకి కాస్త తగ్గినా, మ్యాట్నీ, ఫస్ట్ షోకి మళ్లీ టికెట్లు బాగానే తెగాయి. దాంతో సరైనోడు టీమ్ కూడా షాకవుతోంది. ”ఎంత పెద్ద సినిమా అయినా పాజిటీవ్ టాక్ వచ్చినా సోమవారం నుంచి వసూళ్ల ప్రభావం బాగా తగ్గుతుంది. అయితే సరైనోడుకి మాత్రం 80 శాతం వసూళ్లు దక్కాయి. మంగళవారం 70 శాతం ఉంది. ఈ మాత్రం టికెట్లు తెగాయంటే గొప్పే. ఇది మేం కూడా ఊహించలేదు” అంటూ సరైనోడు టీమ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. మరో రెండ్రోజులు ఇలానే వసూళ్లు స్టడీగా ఉంటే.. బయ్యర్లు కూడా గట్టెక్కేసే అవకాశం ఉంది.