జగన్మోహన్ రెడ్డి డిల్లీలో చేస్తున్న హడావుడిపై తెదేపా నేతలు తమదైన శైలిలో ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు. తెదేపా ప్రభుత్వం అవినీతి, అక్రమాలను తెలియజేస్తూ వైకాపా ప్రచురించిన పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి చూపిస్తూ, దానిలో అంశాల గురించి వివరిస్తుంటే, ఆయన చాలా శ్రద్దగా జగన్ చెపుతున్నవి వింటున్నట్లు ఫోటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవి తెదేపా నేతలకు చాలా ఆగ్రహం కలిగించేవే. అందుకే తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు బహుశః రాజ్ నాథ్ సింగ్ సింగ్ ని ఉద్దేశ్యించే ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసినట్లున్నారు. జగన్ వంటి ఆర్ధిక నేరస్తులని కలిసేటప్పుడు కేంద్ర మంత్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేందుకే డిల్లీ యాత్ర పెట్టుకొన్నారని ఆయన విమర్శించారు.
బొండా ఉమా కేంద్ర మంత్రులకు చేసిన సూచనలో వారు జగన్మోహన్ రెడ్డితో ఆవిధంగా భేటీ అవడం తమకు ఏమాత్రం నచ్చలేదని స్పష్టంగానే చెపుతున్నట్లు భావించవచ్చు.
ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా జగన్ పై విమర్శలు చేసారు. సాక్షిలో అల్లుకొన్న కట్టు కధలనే ఇంగ్లీషులోకి అనువదించి వాటిని పుస్తకంగా ప్రచురించి, రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ డిల్లీలో విషం కక్కుతున్నారు. పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనబడినట్లుగా అవినీతి కేసులలో కోర్టుల చుట్టూ తిరుతున్న జగన్మోహన్ రెడ్డికి లోకంలో అందరూ అవినీతిపరులలాగే కనిపించడం సహజం. స్వంత ఎమ్మెల్యేలే ఆయనను నమ్మలేక పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతుంటే, ఏమి చేయాలో దిక్కుతోచక డిల్లీ వెళ్లి మా ప్రభుత్వంపై విషం చిమ్ముతూ కాలక్షేపం చేస్తున్నారు. జగన్ తన అసమర్ధతని, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టిని మళ్ళించడానికే డిల్లీ వెళ్లి ఈ డ్రామాలు ఆడుతున్నారు,” అని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేసారు.
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్ళిన ప్రతీసారి తెదేపా నేతలందరూ అయన తన సిబీఐ కేసులను మాఫీ చేయించుకోవడానికే డిల్లీ వెళ్ళారని ఆరోపిస్తుంటారు. కానీ ఈసారి యనమల విమర్శలలో ఆ పాయింట్ మిస్ అవ్వడం గమనార్హం. ఈసారి జగన్ డిల్లీ యాత్ర వలన తెదేపా ప్రభుత్వానికి ఎంతో కొంత నష్టం, కేంద్రం వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఎదురవవచ్చని వారు కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకే వారు వేరేవిధంగా స్పందిస్తున్నట్లున్నారు.