తెలుగు సినీ నిర్మాత, తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తాను తమిళనాడు ఎన్నికలలో ముఖ్యమంత్రి జయలలితపై పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆమె పోటీ చేస్తున్న రాధాకృష్ణ నగర్ నియోజక వర్గంతో బాటు రాష్ట్రంలో తెలుగువారు అధికంగా స్థిరపడిన హోసూరు నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్నాడిఎంకె ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రంలో తెలుగుబాష కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తోందని, తెలుగువారిని ఏమాత్రం గౌరవించడం లేదని, అందుకే తెలుగువాళ్ళ తరపున తను ఆమెపై పోటీకి దిగవలసి వస్తోందని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికలలో తను గెలిస్తే తెలుగువారికి జరుగుతున్న అన్యాయం గురించి శాసనసభలో తెలుగువారి తరపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తానని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరులో పర్యటిస్తున్నపుడు జగదీశ్వర్ రెడ్డి వెళ్లి ఆయనని కలిసి, తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తెదేపా పోటీ చేయాలని కోరారు కానీ చంద్రబాబు నాయుడు స్పందించలేదు. కనుక తనే పోటీకి సిద్దమయ్యారు. అయితే జయలలితను డ్డీకొని గెలవడం అసాధ్యం అని ఆయన కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకే హోసూరు నుంచి కూడా పోటీ చేస్తున్నట్లున్నారు. ఒకవేళ హోసూరు నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెట్టినా, ఆయన గొంతు వినిపించనిస్తారా?అంటే అనుమానమే. ఎందుకంటే అన్నాడిఎంకె పార్టీలో కూడా ఇద్దరు తెలుగువాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని తెలుగు పాటశాలలను ఒకటొకటిగా మూసేస్తున్నా, తెలుగు అధ్యాపకులను, విద్యార్ధులను మానసికంగా వేధిస్తున్నా వారిద్దరూ ఏనాడూ కూడా శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. జాతీయ పార్టీగా అవతరించాలనుకొన్న తెదేపాకి ఈ ఎన్నికలు చాలా మంచి అవకాశం కల్పించినప్పటికీ దానిని వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు…ఎందుకో?