రాయపాటి, జేసీ దివాకర్ రెడ్డి వంటి సీనియర్ రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రత్యేకహోదా విషయంలో వారిరువురూ చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేకహోదా రాదని చంద్రబాబు నాయుడికి ముందే తెలుసని అందుకే ఆయన ప్రత్యేక ప్యాకేజి గురించి మాట్లాడుతున్నారని జేసి అంటే, కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వనని చెపుతుంటే ఇంకేమి చేయాలి…బట్టలూడదీసుకొని తిరగాలా? అని రాయపాటి వంటి సీనియర్ నేత మీడియాని ఎదురు ప్రశ్నించడం చాలా విస్మయం కలిగిస్తోంది.
వారిద్దరూ రాజకీయాలలో చాలా సీనియర్లు. కానీ నిన్నగాక మొన్న రాజకీయాలలో అడుగుపెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదా కోసం పోరాడేందుకు ముందు కు వచ్చినట్లయితే తామంతా అతని వెనుక నిలిచి పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పడం మరీ విస్మయం కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో వ్యవహరిస్తున్న తీరు, అతని ప్రతిస్పందనలు అన్నీ చూస్తున్నవారు అతనికి ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని భావిస్తుంటే, జేసీ, రాయపాటి వంటి సీనియర్లు అతని నేతృత్వంలో పోరాడేందుకు సిద్దమని చెప్పుకోవడం సిగ్గుచేటు.
జేసి, రాయపాటి వంటి రాజకీయ నేతలు తమ రాజకీయ జీవితం నష్టపోకుండా ఎప్పుడు ఏ పార్టీలోకి దూకి కాపాడుకోవాలో బాగా తెలుసు. తమతమ వ్యాపారాలలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా వాటిని ఏవిధంగా ఎదుర్కొని లాభాలలో నడిపించుకోవాలో తెలుసు. కానీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా మిత్రపక్షంగా కొనసాగుతూ కూడా ప్రత్యేకహోదాని ఏవిధంగా సాధించాలో తెలియదుట! పైగా రాజకీయాలలో ఇంకా ఓనమాలు కూడా దిద్దని పవన్ కళ్యాణ్ వెనుక నడుస్తారుట! అందుకే పవన్ కళ్యాణ్ వారికి చేతకాకపోతే రాజీనామాలు చేసి తప్పుకోమని సూచించారు. కానీ వారికి చేతకాకపోయినా పదవులను పట్టుకొని వ్రేలాడుతూనే ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ ఏమంటారో?