యూపియే హయంలో జరిగిన ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలు కోసం మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి. త్యాగితో సహా యూపియే ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకి, మధ్యవర్తులకి భారీగా లంచాలు ముట్టినట్లు మూడు రోజుల క్రితం ఇటలీలో మిలన్ కోర్టు బయటపెట్టడంతో రాజకీయవర్గాలలో కలకలం మొదలయింది.
ఉత్తరాఖండ్ వ్యవహారంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు జవాబు చెప్పుకోలేక సతమతమవుతున్న మోడీ ప్రభుత్వానికి, ఈ అగస్టా కేసు సరయిన సమయానికి గొప్ప ఆయుధంగా దొరికింది. దానితో పార్లమెంటులో భాజపా కూడా రెచ్చిపోయింది. ఆ వ్యవహారంపై నేడు రాజ్యసభలో అధికార, కాంగ్రెస్ పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. దానితో సభ అనేకసార్లు వాయిదా పడింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సభలో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తనపై నిరాధారమయిన ఆరోపణలు చేస్తూ దేశ ప్రజల దృష్టిలో తనను ఒక అవినీతిపరురాలిగా చూపించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, తమ ప్రభుత్వం ఎటువంటి అవినీతికి పాల్పడలేదని సోనియా గాంధీ గట్టిగా వాదించారు. గత రెండేళ్లుగా మోడీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసుపై దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదు? దోషులను ఎందుకు కనుగొనలేదు? అని ఆమె ప్రశ్నించారు. ఈకేసులో తన పేరు ప్రస్తావించినంత మాత్రాన్న తానేమీ భయపడిపోనని చెప్పారు.
ఈ కుంభకోణంలో సోనియా గాంధీ మాతృదేశమయిన ఇటలీకి చెందిన న్యాయస్థానమే గత యూపియే ప్రభుత్వంలో పెద్దలకు లంచాలు ముట్టాయని ప్రకటించడం వలన ఆమె పార్లమెంటులో చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఒక భారీ కుంభకోణం వెలుగు చూసినప్పుడు, దాని వెనుకున్న పెద్ద మనుషులను పట్టుకొని శిక్షించే ఆలోచన చేయకుండా, ఆ కుంభకోణాన్ని కేవలం తమ ప్రత్యర్ధులను ఇరుకున పెట్టగల ఆయుధంగా మాత్రమే చూడటం విస్మయం కలిగిస్తుంది. అగస్టా ఒక్కటే కాదు గతంలో జరిగిన 2జి,3జి, కామన్ వెల్త్ క్రీడలు, బొగ్గు గనుల కేటాయింపు వంటి అనేక కుంభకోణాలలో ప్రభుత్వాలను నడిపిన రాజకీయ నేతలెవరికీ శిక్షలు పడలేదు. కనిమోలి, రాజా వంటి కొందరు కొన్ని నెలలు జైల్లో ఉండి వచ్చారు తప్ప ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు..ఎప్పటికీ విచారణ పూర్తి కాదు కనుక శిక్షలు పడలేదు. అందరూ బెయిల్ పై విడుదలయ్యి వచ్చి మళ్ళీ చట్టసభలలో సభ్యులుగా ఉంటున్నారు కూడా. గత రెండేళ్లుగా మోడీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసుపై దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదు? దోషులను ఎందుకు కనుగొనలేదు? అనే సోనియా గాంధీ ప్రశ్నకు మోడీ ప్రభుత్వం జవాబు చెప్పలేకపోతోంది అంటే ఈ వ్యవహారంలో భాజపా నేతల పేర్లు కూడా ఉండి ఉండాలి లేదా దర్యాప్తు ముందుకు సాగలేదని స్పష్టం అవుతోంది. కనుక ఇటువంటి కుంభకోణాలు అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటులో, బయట రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయని భావించవలసి ఉంటుంది.