హైదరాబాద్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతను సమర్థించుకుంటూ, శిధిలావస్థకు చేరితే చార్మినార్నైనా కూల్చటానికి వెనకాడబోమని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చటంలో తప్పులేదని చెప్పారు. ఆ స్థలంలోనే 10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయస్థాయిలో కొత్త భవనాన్ని కడతామని చెప్పారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా, పాత భవనాలు ముఖ్యమా అంటూ మండిపడ్డారు. శిధిలావస్థకు చేరితే చార్మినార్నుకూడా కూల్చాల్సిందేనన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పేరు మార్చబోమని చెప్పారు.
మరోవైపు, మహ్మూద్ అలీ మాటలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ వి.హనుమంతరావు తప్పుబట్టారు. అలీ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని చెప్పారు. చార్మినార్, ఉస్మానియా ఆసుపత్రివంటి భవనాలు హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకలు అని, వీటిని కూలుస్తామంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుందని అన్నారు.
పదిరోజులక్రితం కేసీఆర్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించటం, వెంటనే దానిని కూలగొట్టి అక్కడే కొత్త భవనం కట్టాలని నిర్ణయించటం తెలిసిందే. ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్ సంస్థ అంటూ వివిధ సాంస్కృతిక సంస్థలు, పార్టీలు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ప్రతినిధిసంఘం ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి, కూల్చివేత అవసరంలేదని తీర్మానించింది. కేసీఆర్ నిర్ణయం వెనక సొంత ఎజెండా ఏమైనా ఉండొచ్చని కాంగ్రెస్ నేతలు వీహెచ్, భట్టి విక్రమార్క, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఉపముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. చార్మినార్ను కూల్చితే బాబ్రీ ఘటన పునరావృతమవుతుందన్నారు. చార్మినార్ పైన మసీదు ఉందని, ఉపముఖ్యమంత్రి సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మొత్తంమీద వివాదాల తేనెతుట్టెను కదిల్చి కేసీఆర్కు కొత్త తలనెప్పి తెచ్చిపెట్టారు మహమూద్ అలీ.