శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన మెంటల్ పోలీస్ టైటిల్ వివాదాస్పదమైన సంగతి తెలిసింది. ఈ టైటిల్ పై వివరణ ఇవ్వాల్సిందిగా శ్రీకాంత్‌కి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తరవాత హైకోర్టు ఈ సినిమా టైటిల్ మార్చేంత వరకూ విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. అయినా సరే… చిత్రబృందం మాత్రం టైటిల్‌ని కాపాడుకొనే ప్రయత్నాల్లోనే ఉంది. ‘మా సినిమాకి ఇదే సరైన టైటిల్’ అంటూ వాదిస్తోంది. ”కావాలంటే మా సినిమాచూడండి. ఆ తరవాత ఈ టైటిల్ ఉంచాలో, తీసేయాలో పోలీసులనే చెప్పనివ్వండి” అంటూ విన్నవించుకొంటోంది.
”పోలీసుల గౌరవాన్ని నిలిపే చిత్రం మెంటల్ పోలీస్. ఈసినిమా చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమవుతుంది. పోలీస్ శాఖకి ప్రత్యేకంగా మా సినిమా చూపించాలనుకొంటున్నాం. సినిమా చూసిన తరవాత కూడా టైటిల్ మార్చాల్సిందే అని వాళ్లు చెబితే తప్పకుండా మేం టైటిల్ మారుస్తాం” అంటూ దర్శకుడు బాబ్జీ పోలీస్ శాఖని కోరుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో పోలీస్ ఉన్నతాధికారులకు మెంటల్ పోలీస్ ప్రత్యేక్ష షో ప్రదర్శించబోతున్నారని తెలిసింది. మరి ఈ సినిమా చూశాక పోలీసులు ఏమంటారో? టైటిల్ ఉంచినా, తీసేసినా.. ఈ సినిమాకి రావల్సిన పబ్లిసిటీ మాత్రం టైటిల్ రూపంలో వచ్చేసింది. సో.. చిత్రబృందం ఆ విషయంలతో హ్యాపీనే.