ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. రాష్ట్ర హైకోర్టు తీర్పు పూర్తి పాఠం ఆధారంగా తన పిటిషనులో కొన్ని మార్పులు చేయాలనుకొంటున్నట్లు కేంద్రప్రభుత్వం చేసిన అభ్యర్ధనను సుప్రీం కోర్టు అనుమతించింది. అందుకు వీలుగా ఈ కేసును మే3వరకు వాయిదా వేసింది. ఆ కేసుపై ఈరోజు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలుచేయడానికి అనుమతించింది. ఈ కేసుపై మూడు రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత మే నెలలో వేసవి శలవులకు వెళ్ళేలోగా దీనిపై తీర్పు వెలువరిస్తామని సుప్రీం ధర్మాసనం చెప్పింది. ఈ కేసులో కేంద్రప్రభుత్వం వాదిస్తున్న అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ మంగళవారం ఉదయం నుంచి బుధవారం భోజన విరామ సమయం వరకు, కాంగ్రెస్ పార్టీ తరపున కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలకు అప్పటి నుంచి గురువారం సాయంత్రం వరకు తమ తమ వాదనలు వినిపించేందుకు సమయం కేటాయించింది