ఖమ్మం గుమ్మంలో అడుగుపెట్టిన కేసీఆర్ తిరుగు ప్రయాణ సమయానికి ఫుల్ జోష్ తో తెరాస శ్రేణుల్లో కొత్త ఉత్తేజం తొణికిసలాడింది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఖమ్మంలో జరిగిన తెరాస ప్లీనరీ, ఆ పార్టీకి భారీ ప్రచారాన్నే చేసి పెట్టింది. తుమ్మలను బంపర్ మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం వేదికగా కేసీఆర్ పిలుపునిచ్చారు. పాలేరులో గెలుపు నల్లేరుమీద నడక కావాలనే సంకల్పంతో కావచ్చు, పక్కా ప్లాన్ తో ప్లీనరీ, బహిరంగ సభను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన, బంగారు తెలంగాణ ఆశయ సాధన లక్ష్యాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీని డిజైన్ చేశారు. రాష్ట్ర సాధకుడే ప్రగతి రథ సాధకుడనే సందేశాన్ని మరోసారి ప్రబలంగా ఇవ్వడానికి ప్లీనరీని వేదికగా చేసుకున్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల గురించి మంత్రి హరీష్ రావు అనర్గళంగా వివరించారు. వరంగల్ నుంచి పాలమూరు దాకా ఏయే జిల్లాకు ఏయే ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుందనే లెక్కలను ఘంటాపథంగా వివరించారు.
హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అన్నం పెట్టే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు. సంక్షేమ పథకాలు, నిధుల గురించి ఆయన కూడా అనర్గళంగానే లెక్కలు చెప్పారు. మొత్తానికి మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పుల్ జోష్ తో ప్రసంగించారు. ఒక పండుగలా ప్లీనరీని ఆద్యంతం హుషారుగా నిర్వహించారు.
మొత్తం ప్లీనరీ, బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగమే హైలైట్. దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తాననే మాట తప్పాననే విమర్శను తనదైన శైలిలో తిప్పికొట్టారు. ప్రజలు ఎలా చెప్తే బాగా రిసీవ్ చేసుకుంటారో ఆయనకు బాగా తెలుసు. అందుకే తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి కారణం పదవీ కాంక్ష కాదని బల్లగుద్దిన తరహాలో ఘంటాపథంగా చెప్పారు. వేరే వాళ్లు ముఖ్యమంత్రి అయితే మళ్లీ ఆంధ్రా పెత్తందార్ల దాడులు జరగవచ్చనే ఉద్దేశంతో తానే ఈ బాధ్యతను తలకెత్తుకున్నానని చెప్పారు. అంటే, ముఖ్యమంత్రి పదవి అనే బరువు బాధ్యతలను మోయడం త్యాగం అనే తరహాలో ప్రజలకు కన్విన్సింగ్ గా చెప్పడానికి ప్రయత్నించారు. ఇక ఉద్యమ ఘట్టాలు, బంగారు తెలంగాణ ఆశయాలు వగైరా విషయాలపై ఎప్పట్లాగే అనర్గళంగా, ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించారు.
మొత్తానికి ఖమ్మం గులాబీ మయమైంది. టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాలేరులోనూ గులాబీ మెరుపులు తళుక్కుమన్నాయి. కేడర్ ఫుల్ జోష్ తో తిరుగుముఖం పట్టింది. ఇక బంపర్ మెజారిటీతో విజయం ఒక్కటే బాకీ అని నాయకులు ధీమాతో చెప్తున్నారు. ఇదీ… తెరాస ప్లీనరీ సీనరీ.