తెదేపా ప్రభుత్వ అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి డిల్లీలో చేస్తున్న హడావుడి తెదేపా నేతలందరికీ కంగారు పుట్టిస్తున్నట్లే కనబడుతోంది. ప్రకాశం జిల్లా అద్దంకి వైకాపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆ జిల్లాకు చెందిన పలువురు వైకాపా నేతలను బుధవారం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తాను అహర్నిశలు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి కృషి చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
“లక్ష కోట్లు అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్న జగన్ వాటిని నిరూపించి చూపాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా డిల్లీ వెళ్లి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎటువంటివారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తే చివరికి మనమే నష్టపోతాము. జగన్ వంటివాళ్ళు ఎంతమంది అడ్డుపడినా నా పని నేను చేసుకుపోతాను. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే నా లక్ష్యం,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
‘చంద్రబాబు నాయుడు అవినీతిలో రారాజు’ అనే పేరుతో ఏకంగా పెద్ద పుస్తకమే ప్రచురించి జగన్ డిల్లీలో తను కలుస్తున్న వారందరికీ మిటాయిలు పంచిపెటినట్లు పంచి పెడుతున్నారు. అందులో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ అవినీతి గురించి పూర్తి సాక్ష్యాధారాలతో సహా ప్రచురించినట్లు జగన్ అందరికీ చెప్పుకొంటున్నారు. ఆ పుస్తకాన్ని కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలు కూడా ఆసక్తికరంగా పేజీలు తిరగవేయడం గమనార్హం.
ఆ పుస్తకంలో చేసిన ఆరోపణలన్నిటికీ జగన్ కట్టుబడినట్లే భావించవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు మళ్ళీ అవినీతికి ఆధారాలు చూపమని, నిరూపించమని జగన్మోహన్ రెడ్డికి సవాలు విసరడం కంటే, వాటిని ఆయన వ్యతిరేకిస్తున్నట్లతే, ఆ పుస్తకం వలన తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని భావిస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసి, తనపై చేసిన ఆరోపణలను నిరూపించమని కోరడం మంచిది. ఇంత జరిగిన తరువాత కూడా ఆయన జగన్ ఆరోపణలను తేలికగా కొట్టిపారేసి చేతులు దులుపుకొంటే, అది ప్రజలకు, కేంద్రప్రభుత్వానికి కూడా తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. దీనిపై న్యాయస్థానంలో సవాలు చేయడం ఇష్టం లేదనుకొంటే జగన్ కోరుతున్నట్లుగా సిబీఐ విచారణకు ఆదేశించవచ్చు. అప్పుడు పాలేవొ నీళ్ళేవో తేలిపోతుంది. దాని వలన ఎవరు నిజాయితీపరులయితే ప్రజలలో వారి విశ్వసనీయత కూడా పెరుగుతుంది కూడా.