చాలాకాలం నుంచి పెండింగులో ఉన్న ఒక రాజకీయ వ్యవహారం కొలిక్కి వచ్చింది. కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు. ‘వైఎస్’ మార్కు రాజకీయాల్లో ఇమడలేని వ్యక్తి మైసూరారెడ్డి. ఆయన ఆ పార్టీలో చేరడమే ఒక చిత్రమైన పరిణామం. వైఎస్ రాజశేఖరరెడ్డితో సుదీర్ఘకాలం శత్రుత్వాన్ని కొనసాగించి, ఆయన మరణానంతరం, జగన్ నేతృత్వంలోని పార్టీలో చేరడం చిత్రం! అయితే తాజాగా వైకాపాను వీడుతూ ఆయన రాసిన లేఖలో.. ఆ చేరిక కూడా ఒక యాక్సిడెంట్ లాగా జరిగినట్లు ఆయన తేల్చిచెప్పేశారు.
ఆ విషయం పక్కన పెడితే.. రాజకీయాల్లో ఎంతో సీనియారిటీ, అనుభవం ఉన్న మైసూరారెడ్డి భవిష్యత్తు ఏమిటి? అనేదానిమీద ఇప్పుడు నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వైకాపానుంచి బయటకు వస్తున్న వారందరికీ,, వారు ఇంకా రాజకీయ జీవితాన్ని కోరుకుంటూ ఉంటే గనుక.. తెలుగుదేశం తప్ప మరో గత్యంతరం లేదని అందరికీ తెలిసిన సంగతే. మైసూరా కూడా తెలుగుదేశంలోకే వెళ్ల వచ్చు. ఎటూ.. ఆయన తెదేపాలో చేరేట్లయితే సంతోషంగా స్వాగతిస్తాం అంటూ అక్కడి మంత్రులు కూడా సాదరంగా రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. వారు ఆహ్వానించడం సంగతి అటుంచి… మైసూరారెడ్డి కూడా జగన్‌కు రాసిన లేఖలోనే తన తెదేపా ప్రియత్వాన్ని చాటుకుంటున్నారు. తాను కేవలం టిఫిన్‌కోసం పిలిపించినప్పుడు జగన్ ఇంటికి వెళితే.. దానికి చిలవలు పలవలు ముడిపెట్టి.. పార్టీ కండువా కప్పేశారంటూ మైసూరా అప్పటి చేరికను అభివర్ణించడం విశేషం. అంటే తెదేపాను వీడడమే ఇష్టపూర్వకంగా జరగలేదనే సంకేతాలు ఇచ్చేశారు. తెదేపాలోకి తిరిగి అడుగుపెట్టడానికి ఇది ఆయన సిగ్నల్ అనుకోవచ్చు.
అయితే ఆయన తన లేఖలో రాయలసీమ ప్రియత్వాన్ని కూడా చాటుకున్నారు. జగన్‌మీద నిందలు సంధించడానికి ఆయన రాయలసీమ ఉద్యమ ప్రస్తావన తేవడం బాగానే ఉన్నది గానీ.. తెదేపాలో చేరినప్పటికీ కూడా.. ఆయన ఆ విషయంలో మౌనాన్నే పాటించాల్సి వస్తుందని పలువురు అనుకుంటున్నారు. సీమకు ప్రత్యేకంగా మేలు చేయడం అనేది తెదేపా సర్కారు ఎజెండాలో కూడా లేదు. తాను చేరడం వల్ల చంద్రబాబు సీమకు ప్రత్యేకంగా ఒరగబెట్టేస్తాడని మైసూరా అనుకుంటే.. ఆది ఆత్మవంచనే. కాకపోతే.. ఏదో తన రాజకీయ ప్రస్థానం కోసం తెలుగుదేశం పంచన చేరి అప్పుడప్పుడూ సీమ మాటలు వినిపించుకుంటూ.. రోజులు వెళ్లదీయడం వరకు ఆయనకు ఢోకా ఉండకపోవచ్చు. తెదేపాలో ఇదివరకటిరోజుల్లో ఉన్నంత ప్రాధాన్యం ఆయనకు ఇక దక్కకపోవచ్చు. అంతకంటె ప్రత్యేకంగా ఆయన ఇప్పుడు చేయగలిగింది కూడా లేదు.