”నీ ఊరికొస్తా.. నీ వీధికొస్తా… నీ ఇంటి కొస్తా… నట్టింటికొస్తా..”
”సెంటర్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..” వంటి పంచ్‌డైలాగుల ప్రస్తావన వస్తే చాలు.. తెలుగు ప్రజలు అందరికీ నందమూరి బాలయ్య గుర్తుకు వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు తెలుగురాష్ట్రం రాజకీయాల్లో మామ బాలకృష్ణను గుర్తుకుతెస్తూ.. ఆ రేంజి పంచ్ డైలాగులతో నారా లోకేష్ రాజకీయ ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా విశాఖ వేదికగా.. జగన్ మీద ఫైర్ అయిన నేపథ్యంలో ”ఆరోపణలు చేయడం కాదు. దమ్ముంటే ఆధారాలతో చర్చకు రా.. ఎక్కడైనా ఎప్పుడైనా సరే..” అంటూ లోకేష్ పంచ్‌లు వేయడం గమనార్హం.
లోకేష్ మాటల్లో మారుతున్న తీరు ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ స్థాయిలో దూకుడుగా వైకాపాను తిట్టిపోయడానికి వారికి కొత్త ఆధరవు దొరికినట్లే లెక్క!
ఇన్నాళ్లూ తెదేపా- వైకాపా మధ్య శత్రు రాజకీయాల్లో ఒక చిత్రమైన పరిస్థితి ఉండేది. చంద్రబాబునాయుడును, జగన్ ఎడాపెడా తిట్టేస్తూ ఉండేవాడు. అడ్డూ అదుపూ లేకుండా విమర్శలు సాగిస్తూ ఉండేవాడు. అయితే చంద్రబాబునాయుడు ఎంతగా కుతకుతలాడిపోయినా.. జగన్ విమర్శల పట్ల స్పందించాలంటే ఆయనకు చిన్నతనం. జగన్‌కు స్పందించడం అంటే తన స్థాయి తక్కువ అని చంద్రబాబు ఫీలింగ్‌గా ఉండేది. తెదేపా మంత్రులు కొందరు జగన్‌ను ఇంతకంటె పెద్ద పంచ్‌లతో తిట్టిపోసినా సరే.. సమఉజ్జీల్లాగా ఉండేది కాదు. ఇప్పుడు లోకేష్ వచ్చి తొడకొట్టడం ప్రారంభించిన తర్వాత.. కాస్త జోరు పెరుగుతున్నట్లుగా ఉంది.
అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. లోకేష్ విమర్శలకు జగన్ స్పందించడు. లోకేష్ తన స్థాయి కాదన్నట్లుగా, తాను న్పందిస్తే చిన్నతనం అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తాడు. మొత్తానికి ఎంత దారుణమైన పంచ్‌లు వేసుకుంటూ విమర్శలు చేసుకున్నా సరే.. ఈ రెండు పార్టీల అగ్ర నాయకుల మధ్య అన్ని విమర్శల వ్యవహారాలూ ముసుగులో గుద్దులాటలాగానే నడుస్తూ ఉంటాయి.